ఇండస్ట్రీతో పనిలేకుండా ఎక్కడైనా ఎప్పుడూ బోర్ కొట్టని కాన్సెప్ట్ ఒకటుంది.. అదే రొమాంటిక్ కామెడీ. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఈ కాన్సెప్ట్ ఒక్కసారైనా ట్రై చేసుంటారు. అందుకే ఎవర్గ్రీన్ హిట్ ఫార్ములా ఇది. ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో ఈ రొమాంటిక్ కామెడీస్కు డిమాండ్ బాగా పెరుగుతుంది. తాజాగా మరో సినిమా ఇదే దారిలో వస్తుంది.
సినిమా అంటే కాస్త ఫన్నీగా, కాస్త ఎమోషనల్‌గా, కాస్త రిలీఫ్ ఇచ్చేలా ఉంటే చాలు అంటున్నారు ఆడియన్స్. ఇవన్నీ రొమాంటిక్ కామెడీస్లో ఉంటాయని అలాంటి కథలే ఎంచుకుంటున్నారు హీరోలు.
ప్రియదర్శి, నభానటేష్ జంటగా నటిస్తున్న డార్లింగ్ కూడా ఇదే జోనర్లో వస్తుంది. ట్రైలర్ అంతా ఎఫ్ 2 తరహాలో ఫన్నీగా సాగిపోతుంది. భార్యా భర్తల చిలిపి తగాదాల నేపథ్యంలో ఎఫ్ 2 సినిమా వచ్చింది.. అదొచ్చి ఐదేళ్లవుతున్నా ఇప్పటికీ ఆ జోనర్లో వస్తూనే ఉన్నాయి సినిమాలు. డార్లింగ్ కూడా అలాంటిదే.
మొన్న విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్, ఖుషీ కూడా రొమాంటిక్ కామెడీసే. సీతా రామం, హాయ్ నాన్న లాంటి సినిమాల్లో రొమాన్స్‌తో పాటు మనసును తట్టే ఎమోషన్స్ కూడా బలంగానే ఉన్నాయి. కుర్ర హీరోలు ఎక్కువగా రొమాంటిక్ కంటెంట్ వైపు అడుగులేస్తున్నారు.
గతేడాది నవీన్ పొలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన రొమాంటిక్ కామెడీనే. అలాగే లవ్ స్టోరీ, ఫిదా, గీతగోవిందం, లవ్ స్టోరీ, వరుణ్ తేజ్ తొలిప్రేమ లాంటి సినిమాలన్నీ ఈ జోనర్లో వచ్చినవే. కాస్త ఎమోషన్, కాస్త ఫన్నీ సీన్స్‌తో వస్తే.. ఈ జోనర్లో మంచి హిట్ కొట్టొచ్చని చాలా మంది దర్శకులు నిరూపించారు.