నితిన్ తమ్ముడు సమ్మర్ లో రిలీజ్ కానుందా..?

యంగ్ హీరో నితిన్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఎక్స్ ట్రా అనే సినిమా చేస్తున్నాడు. దీనికి ఆర్డినరీ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీని డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ లేక కాస్త వెనకబడ్డాడు. అందుకని ఎక్స్ ట్రా మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అలాగే ఇక నుంచి కథల విషయంలో ఎంతో కేర్ తీసుకుని సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు. తాజాగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఓ సినిమాని ప్రారంభించాడు.

ఈ మూవీ టైటిల్ తమ్ముడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రాన్ని సాధ్యమైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. వకీల్ సాబ్ మూవీ తర్వాత వేణు శ్రీరామ్ చాలా ప్రయత్నాలు చేశాడు కానీ.. వర్కవుట్ కాలేదు. ఇప్పుడు నితిన్ తో తమ్ముడు సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చాడు. ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. దిల్ రాజు నిర్మాణంలో ఎక్కువ రోజులు తీసుకోవడానికి ఇష్టపడరు. అందుచేత ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. మరి.. ఎక్స్ ట్రా, తమ్ముడు చిత్రాలతో నితిన్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.