మట్కా.. వరుణ్ కెరీర్ ను మార్చేనా..?

మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ బిగినింగ్లో విభిన్న కథా చిత్రాలతో సక్సెస్ సాధించాడు. అయితే.. ఈమధ్య కాలంలో వరుణ్‌ డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ఇంకా చెప్పాలంటే.. వరుణ్ తేజ్ కు సక్సెస్ వచ్చి చాన్నాళ్లు అయ్యింది. ఈసారి మట్కా అంటూ మరో వైవిధ్యమైన కథతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇంతకీ.. మట్కా ఎంత వరకు వచ్చింది..? ఈ మూవీ అయినా కెరీర్ ను మార్చేనా..?

ముకుంద, కంచె, లోఫర్, ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్.. ఇలా విభిన్న కథా చిత్రాలతో మెప్పించాడు. అయితే.. ఇటీవల గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాలు వరుసగా ఫ్లాప్స్ అవ్వడంతో కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. ఈసారి ఎలాంటి సినిమా చేయాలా అని బాగా ఆలోచించి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేస్తున్నాడు. అదే.. మట్కా. ఈ మూవీకి కరుణకుమార్ డైరెక్టర్. వైరా ఎంటర్ టైన్మెంట్స్, ఎస్.ఆర్. టీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది.

మట్కా ప్రొగ్రెస్ ఏంటంటే.. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుగుతోంది. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయికలు. జి.వీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వరుణ్ తేజ్ పై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయితే దాదాపు షూటింగ్ పూర్తైనట్టే అని సమాచారం. ఇటీవల రిలీజ్ చేసిన మట్కా ఫస్ట్ లుక్ పోస్టర్ కు అనూహ్య స్పందన లభించింది. ఈ సినిమా పై వరుణ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. వరుసగా మూడు ఫ్లాపులు రావడంతో ఈసారి ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. త్వరలోనే రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారని టాక్. మరి.. మట్కా అయినా వరుణ్ కెరీర్ ను మారుస్తుందో లేదో చూడాలి.