హరిహర పరిస్థితి ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా హరిహర వీరమల్లు షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియకుండా ఉంది. దర్శకుడు క్రిష్ కు తక్కువ సమయంలో సినిమాలు చేస్తాడనే పేరుంది. గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక నేపథ్య సినిమాను 74 రోజుల్లో షూట్ చేశాడు. మరి ఈ సినిమా విషయంలో ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదు. పవన్ డేట్స్ ప్రధాన సమస్యా లేక బడ్జెట్ పరంగా ఇబ్బందులున్నాయా అనేది తెలియాలి. పాండమిక్ ముందు నుంచీ ఈ సినిమా షూటింగ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది.

పవన్ తన పొలిటికల్ యాత్ర ప్రారంభిస్తున్నాడు. దీంతో ఈ సినిమాకు ఎప్పుడు డేట్స్ ఇస్తాడనేది సందేహమే. మధ్యలో వీలు చూసుకుని డేట్స్ ఇచ్చినా..ఇది రెగ్యులర్ మూవీ కాదు కాబట్టి గెటప్, మేకోవర్ అంతా గతంలో చేసిన సీన్స్ కు సరిపోయేలా కంటిన్యుటీలో ఉండాలి. సినిమా టీమ్ నుంచి కూడా ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదనేది అభిమానుల బాధ. మొఘల్ సామ్రాజ్యంలో రాబిన్ హుడ్ లాంటి దొంగ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో నిర్మాతతో కలిసి ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.