అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో బాగా డీలా పడ్డాడు. ఇక నుంచి కెరీర్ లో గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తానని.. త్వరలోనే నెక్ట్స్ మూవీని ప్రకటిస్తానని అఖిల్ చెప్పాడు కానీ.. ఇంత వరకు అనౌన్స్ చేయలేదు. ఇంతకీ అఖిల్ తదుపరి చిత్రం ఎవరితో అంటే… నూతన దర్శకుడు అనిల్ తో అని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని వి మెగా పిక్చర్స్ బ్యానర్ పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తాడనుకున్నారు కానీ.. యు.వీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
త్వరలోనే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయనున్నారు. అయితే.. ఇది సోషియో ఫాంటసీ మూవీ అని.. బడ్జెట్ దాదాపు 40 నుంచి 50 కోట్లు అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి ధీర అనే టైటిల్ అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఈసారి ఎలాగైనా సరే.. బ్లాక్ బస్టర్ సాధించాలనే కసితో ఉన్నాడు అఖిల్. చాలా కష్టపడుతున్నాడు కానీ.. కాలం కలిసి రాకపోవడం వలన ఆశించిన సక్సెస్ రావడం లేదు. ఈసారి ఈ సినిమా కథాచర్చల్లో నాగార్జున కూడా పాల్గొన్నారని.. కొన్ని సూచనలు కూడా ఇచ్చారని తెలిసింది. మరి.. ఈసారి అఖిల్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడని ఆశిద్దాం.