వీఎన్ ఆదిత్య నా ప్రియ శిష్యుడు – గ్లోబల్ మూవీ “ఫణి” మోషన్ పోస్టర్ లాంఛ్ లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు

తన దగ్గర పనిచేయకున్నా వీఎన్ ఆదిత్య తన ప్రియ శిష్యుడు అన్నారు దర్శకుడు కె రాఘవేంద్రరావు. తనను వీఎన్ ఆదిత్య రాజ్ కపూర్ కంటే గొప్ప డైరెక్టర్ అనే వాడని, ఎందుకంటే రాజ్ కపూర్ అన్నమయ్య లాంటి సినిమా చేయలేదని చెప్పేవాడని రాఘవేంద్రరావు గుర్తుచేసుకున్నారు. వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న గ్లోబల్ మూవీ “ఫణి” మోషన్ పోస్టర్ ను రాఘవేంద్రరావు ఈ రోజు రిలీజ్ చేశారు. కేథరీన్ ట్రెసా, మహేశ్ శ్రీరామ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డా.మీనాక్షి అనిపిండి నిర్మిస్తోంది. ఈ కార్యక్రమంలో

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ఆదిత్య అంటే సూర్యుడు. సూర్యుడు అన్ని దేశాల్లో ఉదయిస్తాడు. అలా “ఫణి” సినిమాను గ్లోబల్ మూవీగా రూపొందిస్తున్నారు వీఎన్ ఆదిత్య. ఆదిత్య నా దగ్గర పనిచేయలేదు. కానీ నాకు ఇష్టమైన వాడు. అతను కొత్త వాళ్లతో సినిమా చేయగలడు, స్టార్స్ తోనూ రూపొందించగలడు. “ఫణి” సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ కేథరీన్ ట్రెసా మాట్లాడుతూ – వీఎన్ ఆదిత్య గారు ప్రతిసారీ జానర్ మార్చి కొత్తగా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి తరహా సినిమా నేను ఇప్పటిదాకా చేయలేదు. మా సినిమాలో వివిధ దేశాల ఆర్టిస్టులు నటించారు. ప్రొడ్యూసర్ మీనాక్షి గారికి ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నా. మే నెలలో మా “ఫణి” చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.

డైరెక్టర్ డా.వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ – “ఫణి” సినిమా చిన్న చిత్రంగా మొదలుపెట్టాం. ఆ తర్వాత కేథరీన్ గారు ఒప్పుకోవడంతో మరో స్థాయికి వెళ్లింది. అలా చివరకు గ్లోబల్ మూవీగా మారింది. కేథరీన్ మా సినిమాను ఒప్పుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేస్తోంది. మహేశ్ శ్రీరామ్ కూడా అలాగే కోపరేట్ చేస్తున్నాడు. మా టీమ్ ప్యాషనేట్ గా “ఫణి” మూవీకి పనిచేస్తోంది. త్వరలోనే “ఫణి” చిత్రాన్ని గ్రాండ్ గా మీ ముందుకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా తీసుకొస్తాం. అన్నారు.