ఈ విషయంలో మెగాస్టార్ తర్వాత వెంకీనే

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి అనేక రికార్డులు క్రియేట్ చేశారు. సినిమాల నుంచి రాజకీయాలకు వెళ్లిన తర్వాత ఖైదీ నంబర్ 150 మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. అయితే.. రీ ఎంట్రీ తర్వాత కూడా ఆయన రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. సీనియర్ హీరోల్లో ఎవరికీ సాధ్యం కాని 100 కోట్ల షేర్‌ను చిరు అందుకున్నారు. అలాగే వాల్తేరు వీరయ్యతో 200 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసిన తొలి సీనియర్ హీరోగానూ మెగాస్టార్ చిరంజీవి రికార్డు సృష్టించారు. ఇక విశ్వంభర మూవీతో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోందని సమాచారం.

చిరు సాధించిన 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్.. రికార్డులను ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ఒకేసారి అందుకుంటుండడం విశేషం. సంక్రాంతికి రిలీజై అదిరిపోయే వసూళ్లతో దూసుకెళుతోన్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ మూడో రోజుకే వంద కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసింది. ఇప్పుడా చిత్రం 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని కూడా దాటేస్తోంది. ఆల్రెడీ ఈ చిత్రం 100 కోట్ల షేర్ క్లబ్బులోకి కూడా అడుగు పెట్టింది. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో చిరుకు మాత్రమే సాధ్యమైన 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ మార్కును ఒకేసారి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో వెంకీ సాధించడం విశేషం.