మరిన్ని చిక్కుల్లో “టాక్సిక్”, “కాంతార 2”

కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ డైరెక్టర్. ఈ మూవీకి కష్టాలు ఎక్కువయ్యాయి. గత సంవత్సరం అక్టోబర్ లో బెంగళూరు దగ్గర్లోని పీన్య ప్రాంతంలో టాక్సిక్ షూటింగ్ జరుగుతోంది. దీని కోసం వేలాది చెట్లు నరికివేశారనే ఫిర్యాదు మీద అటవీ శాఖా మంత్రి ఈశ్వర్ ఖండ్రే ప్రత్యక్షంగా సందర్శించి వాస్తవాలు తెలుసుకున్నారు. వచ్చిన కంప్లయింట్ నిజమేనని నిర్ధారించుకుని షాక్ తిన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అనుమతులు లేకుండా వందలాది ఎకరాలు చదును చేయడం వల్ల పచ్చదనం హరించుకుపోయిందనేది టాక్సిక్ మీద వచ్చిన ప్రధాన వివాదం. తాజాగా నిర్మాతలకు ప్రభుత్వం తరఫున నోటీస్ వెళ్ళింది. ఈ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ కాంట్రావర్సి అంత సులభంగా ముగిసేలా లేదు.

ప్రకృతి కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడిన మరో సినిమా కాంతార 2. ఈ మూవీ టీమ్ కూడా నిబంధనలను ఉల్లంఘించి, వన్యప్రాణులకు లేదా పర్యావరణానికి హాని కలిగించారని ఫిర్యాదు వచ్చింది. దర్యాప్తులో ఇది నిజమని తేలితే, హాసన్ జిల్లాలో షూటింగ్‌ చేయకుండా నిషేధిస్తామని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే ప్రకటించారు. గవిబెట్ట సమీపంలో 23 రోజుల పాటు షూట్ చేయడానికి హోంబలె ఫిల్మ్స్ షరతులతో కూడిన అనుమతి పొందింది. అయితే.. సిబ్బంది పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారని, ఆ ప్రాంతంలో వన్యప్రాణులను కలవరపెడుతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. షూటింగ్‌ ప్రాంతాన్ని వెంటనే పరిశీలించాలని అధికారులను ఆదేశించారు అటవీ శాఖ మంత్రి. సినిమా బృందం షరతులను ఉల్లంఘిస్తే.. లేదా వన్యప్రాణులు లేదా వృక్షజాలం, జంతుజాలానికి ఏదైనా హాని కలిగించిందని తేలితే, షూటింగ్ ఆపేస్తాం. కఠినమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఈ విధంగా టాక్సిక్, కాంతార 2 షూటింగ్స్ కి ప్రకృతి కారణంగా బ్రేక్ పడింది.