డయాబెటిక్ ఫుట్ పై అవగాహన లేక ఎంతోమంది దివ్యాంగులుగా మారుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు తన వంతుగా ప్రయత్నం మొదలుపెట్టారు స్వర్గీయ రెబెల్ స్టార్ కృష్ణంరాజు. యుకెఐడిఎఫ్ఎఫ్ సహకారంతో హెల్త్ క్యాంప్ లను నిర్వహిస్తూ ప్రజలకు డయాబెటిక్ ఫుట్ చికిత్సను అవగాహనను కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు కృష్ణంరాజు సతీమణి శ్రీమతి శ్యామల, కృష్ణంరాజు కూతురు సాయి ప్రసీద. ఈ నెల 20 భీమవరంలో రెండో వార్షిక యుకెఐడీఎఫ్ఎఫ్ హెల్త్ క్యాంప్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. 3 వేల మంది ఈ క్యాంప్ లో పాల్గొని వైద్య సహాయం పొందారు. ఈ హెల్త్ క్యాంప్ డాక్టర్ వేణు కవర్తపు సారథ్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా
శ్రీమతి శ్యామల మాట్లాడుతూ – రెండవ యుకెఐడిఎఫ్ఎఫ్ హెల్త్ క్యాంప్ సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉంది. పెద్ద సంఖ్యలో ప్రజలు మా ఆరోగ్య శిబిరంలో పాల్గొన్నారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలు ఎంత అవసరమో ప్రజల స్పందన తెలియజేస్తోంది. అందరికీ వైద్యం అందాలని స్వర్గీయ కృష్ణంరాజు గారు కోరుకునేవారు. ఆయన ఆశయానికి ప్రతిరూపమే ఈ వైద్య శిబిరం. ఈ హెల్త్ క్యాంప్ ను మరింతగా ముందుకు తీసుకెళ్తాం. అన్నారు.
సాయి ప్రసీద మాట్లాడుతూ – యుకెఐడిఎఫ్ఎఫ్ హెల్త్ క్యాంప్ ద్వారా మేము చేస్తున్న ప్రయత్నం ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురావడం సంతోషంగా ఉంది. మా వైద్య బృందం, ప్రజల సహకారంతో సక్సెస్ ఫుల్ గా క్యాంప్ నిర్వహించాం. డయాబెటిక్ పుట్ కేర్ అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఇలాంటి హెల్త్ క్యాంప్స్ మరిన్ని నిర్వహిస్తాం. అన్నారు.