ఈ నెల 30న ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవి కోసం సి.కళ్యాణ్, దిల్ రాజు పోటీపడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో దిల్ రాజు తన ప్యానెల్ తో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ… ఫిల్మ్ చాంబర్ ఎన్నికల్లో పోటీ చేయడం తన ఇంట్లో కానీ, తన ఆఫీసులో వాళ్లకి కానీ ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు. అయితే, సీనియర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో తాను బరిలో దిగుతున్నానని, సభ్యుల కోసమే తాను ఎన్నికల్లో పాల్గొంటున్నట్టు తెలియచేశారు.
తాము గెలిస్తే.. ఫిల్మ్ ఛాంబర్ ను మరింత బలోపేతం చేస్తామని.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ బాగుండాలని కోరుకునేవాళ్లు దిల్ రాజు కావాలో, వద్దో ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. తన ప్యానెల్ మంచి ఆలోచనలతో ఎన్నికల బరిలో దిగిందన్నారు. సినీ రంగంలో ప్రధానంగా నాలుగు విభాగాల్లో సమస్యలను గుర్తించాం. నిర్మాతలకు, ఎగ్జిబిటర్స్ కు కష్టాలు పెరిగాయి. ఫిల్మ్ చాంబర్ రాజ్యాంగంలో మార్పులు జరాగాలని కోరుకుంటున్నాం. 50 ఏళ్ల నాటి బైలాస్ ను మార్చాల్సిన అవసరం ఉంది. బైలాస్ ను మార్చితే ముందు తరాల వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నారు.
ఒక్కొక్కరి పేరిట 10 బ్యానర్లు ఉన్నాయి కానీ.. ఒక వ్యక్తికి ఒక ఓటు ఉండాలని మేం భావిస్తున్నాం. ఛాంబర్ లో 1500 మంది సభ్యులు నమోదై ఉన్నారు కానీ వారిలో క్రియాశీలకంగా ఉంటోంది 150 మందే. గడచిన మూడేళ్లలో సినిమాలు తీసినవారే ఛాంబర్ లో ఉండాలన్నది మా ప్రతిపాదన. దానికి కొందరు ఒప్పుకోవడం లేదు. మేం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏర్పాటు చేసుకోవడం వెనుక కారణం కూడా ఇదే. ఇండస్ట్రీలో ఐక్యత చాలా ముఖ్యం. అందరం కలిస్తేనే ముందుకు వెళ్లగలం అని దిల్ రాజు స్పష్టం చేశారు.