కార్తికేయ కాన్సెప్ట్ తో ఇప్పటికే రెండు సక్సెలు అందుకున్నారు దర్శకుడు చందూ మొండేటి. ఆయన ఇటీవలి సినిమా కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ తో చందూ మొండేటి మీద స్టార్ హీరోలకు నమ్మకం మరింత పెరిగింది. ఇప్పుడీ దర్శకుడు నాగ చైతన్య హీరోగా మత్స్యకార జీవితాల నేపథ్యంతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా అధికారికంగా అనౌన్స్ అయ్యింది. చందూ మొండేటి, నాగ చైతన్య సినిమాకు తండేల్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాతో పాటు దర్శకుడు చందూ మొండేటి కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతోనూ ఓ సినిమాకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నాలుగు వేదాల సారం ఇప్పటి మనిషి లైఫ్ స్టైల్ కు ఇమిడ్చిన కథను చందూ హీరో సూర్యకు చెప్పాడని, అది సూర్యకు బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ కథతో సినిమా చేయాలని సూర్య భావిస్తున్నారట.
అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు లేవు. ఎందుకంటే హీరో సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయనకు పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ రిలీజ్ కు ఉంది. దీని తర్వాత వాడివాసల్ షూట్ చేయాలి. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇటు చందూ మొండేటి నాగచైతన్య సినిమా తర్వాత కార్తికేయ 3 సెట్స్ మీదకు తీసుకెళ్తారు. రెండేళ్ల తర్వాతైనా ఈ కాంబో మూవీకి రోడ్ క్లియర్ అయ్యే అవకాశాలున్నాయి.