“గేమ్ ఛేంజర్” కథ వెనక ఇంత కథ జరిగిందా

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ స్టోరీ వెనక పెద్ద కథే జరిగిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ కథ ఒక స్టార్ కోసం రాస్తే మరొక స్టార్ కు వెళ్లింది. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఒక కథ రాసుకుని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కు వినిపించారట. ఆ కథ నచ్చడంతో తను డైరెక్ట్ చేస్తానని శంకర్ అంటే.. కార్తీక్ సుబ్బరాజ్ ఓకే అని కథ ఇచ్చారట. అది కాస్తా కోలీవుడ్ స్టార్ విజయ్ దగ్గరకు వెళ్లిందట. శంకర్ చెప్పిన ఈ కథ నచ్చినా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ సినిమా స్థానంలోనే బీస్ట్ ఒప్పుకున్నాడు. విజయ్ దగ్గర ఈ ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో దిల్ రాజు ద్వారా శంకర్ రామ్ చరణ్ ని కలుసుకోవడం, వెంటనే ఎస్ చెప్పించుకోవడం జరిగాయి. ఇదంతా తమిళ మీడియాలో వచ్చిన కథనమే. ఒకవేళ విజయ్ కనక గేమ్ ఛేంజర్ చేసుంటే.. రాజకీయ తెరంగేట్రానికి ముందు చేయాల్సిన సరైన సినిమాగా నిలిచిపోయేది. కానీ అలా జరగలేదు.

రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ మూవీని రెండు సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. మధ్యలో ఇండియన్ 2 చేయాల్సి రావడంతో గేమ్ ఛేంజర్ లేట్ అయ్యింది. దర్శకుడు శంకర్ బ్రాండ్ తో పాటు పొంగల్ బరిలో ఇది తప్పా చెప్పుకోదగ్గ పాన్ ఇండియా మూవీ వేరేది లేకపోవడంతో మీడియా అటెన్షన్ దీని వైపు బాగానే ఉంది. దానికి తోడు నిర్మాత దిల్ రాజు చెన్నైలో ప్లాన్ చేసుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టులుగా రజనీకాంత్, విజయ్ ను ఆహ్వానించారని వస్తున్న వార్త హాట్ టాపిక్ అయ్యింది. వీళ్లిద్దరిలో ఒక్కరు వచ్చినా అదిచ్చే బూస్ట్ మాములుగా ఉండదు. అయితే ఖచ్చితంగా తెలియాలంటే ఇంకొంచెం ఆగాలి.