నాగ చైతన్య తన కొత్త సినిమా కోసం ఉత్సాహంగా రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు తండేల్ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జాలర్ల జీవితాల నేపథ్యంతో దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్, బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం
ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. నాగ చైతన్య కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీగా తండేల్ తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దాదాపు 70 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట.
ఇక ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ సాయి పల్లవి, కీర్తి సురేష్ నటించబోతున్నారట. కథలో పర్ ఫార్మెన్స్ కు అవకాశమున్న కీలక పాత్రలు ఉన్నందువల్ల హీరోయిన్స్ గా వీరిద్దరినీ తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. కీర్తి, సాయి పల్లవి ఎలాంటి ఎమోషనల్ క్యారెక్టర్స్ అయినా చేసి మెప్పించగలరు. ఇక వీరితో నటించేందుకు నాగ చైతన్య పోటీ పడాల్సి రావొచ్చు. నవంబర్ నుంచి తండేల్ ను సెట్స్ మీదకు తీసుకెళ్తారని సమాచారం.
చేపల వేటకు వెళ్లి తెలియకుండా పాకిస్థాన్ జలాల్లో చిక్కుకున్న జాలర్లు తిరిగి ఎలా భారత జలాల్లోకి వచ్చారనేది మూవీ నేపథ్యంగా ఉంటుందని తెలుస్తోంది. దీనికి వాస్తవ ఘటనల స్ఫూర్తి కూడా ఉందట. తన కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి నాగ చైతన్య కూడా ఈ మూవీ కోసం అన్ని విధాల రెడీ అవుతున్నారు.