అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి డైరెక్షన్ లో ఓ విభిన్న ప్రేమకథా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఈ సినిమా తర్వాత నాగచైతన్య.. శివ నిర్వాణతో సినిమా చేయనున్నాడు. గతంలో వీరిద్దరూ కలిసి మజిలీ సినిమా చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు.
ఇప్పుడు ఈ కాంబో సెట్ అయ్యింది. నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించే చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనుంది. అయితే.. ఇది ఏ తరహా చిత్రం..? ఫ్యామిలీ స్టోరీనా..? లవ్ స్టోరీనా..? అంటే చాలా కొత్తగా ఉంటుందని.. చైతన్యలోని మరో కోణాన్ని ఆవిష్కరించే సినిమా చేయబోతున్నాని శివ నిర్వాణ చెప్పారు. లవ్ స్టోరీస్ కాకుండా ఇలాంటి సినిమాలు కూడా తెరకెక్కించగలడా అని షాక్ అయ్యే సినిమా తీయాలి అనుకుంటున్నాను అని శివ నిర్వాణ చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింతగా ఆసక్తి ఏర్పడింది. ఎప్పుడు ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.