ఓ సాధారణ యువకుడు స్మగ్లింగ్ డాన్ గా ఎలా ఎదిగాడు అనే కథతో దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఈ కథలో కొత్తేముంది..అంతకముందు వచ్చిన మహేశ్ బిజినెస్ మేన్ సినిమాలోనూ ఇంతే కథ..గతంలో ఇలాంటివెన్నో సినిమాలు వచ్చాయి కదా అనే మాటలు వినిపించాయి. సినిమా షూటింగ్ లొకేషన్స్ కోసం ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా సినిమా టీమ్ తిరిగినప్పుడు, షూటింగ్ మధ్యలో ఆగిపోయినప్పుడు..ఈ సినిమా పూర్తి చేస్తారా అనే విమర్శలు ఎదురయ్యాయి. డేట్ అనౌన్స్ చేశాక..పోస్ట్ ప్రొడక్షన్ సకాలంలో జరగక ఎట్ లీస్ట్ పుష్పను అనుకున్న సమయానికి విడుదల చేస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఇక పుష్ప రిలీజైన రోజు తెలుగులో మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇతర భాషల సంగతి దేవుడికి తెలియాలి. హిందీలో బాక్సాఫీస్ గురించి ఐడియానే లేదు. పుష్ప రిలీజ్ రోజున ఇదీ పరిస్థితి. కానీ ఎవరూ ఊహించనంతగా…పుష్ప ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్ లో వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇది సుకుమార్ సహా ఎవరూ ఊహించి ఉండరు. సోషల్ మీడియాలో పుష్పరాజ్ డైలాగ్స్ వైరల్ అయ్యాయి. జాతీయ, అంతర్జాతీయంగా వివిధ రంగాల్లో సెలబ్రిటీలు మై ఝుకేగా నహీ డైలాగ్స్ కు వీడియోలు చేశారు. అమూల్ పుష్పరాజ్ తో పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక తర్వాత జరిగిందంతా పుష్ప ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద సృష్టించిన చరిత్ర.
ఆ చరిత్ర ప్రస్థానం ఇప్పుడు పుష్ప రాజ్ కు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందించేదాక సాగింది. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ గెల్చుకున్న తొలి నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయనకు ఇండస్ట్రీ నుంచి తోటి స్టార్స్ శుభాకాంక్షలు అందుతున్నాయి. ఈ అవార్డ్ పుష్ప 2 మేకింగ్ కోసం మూవీ టీమ్ కు ఎంత ఎనర్జీ ఇస్తుందో ఊహించుకోవచ్చు.