“గేమ్ ఛేంజర్” తమిళ్ రిలీజ్ కు తొలగిన అడ్డంకి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ ఈ మూవీని తెరకెక్కించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాను జనవరి 10న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. బాలీవుడ్ లో ప్రమోషన్ చేశారు. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. చెన్నైలో కూడా భారీగా ఈవెంట్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇంతలో అక్కడ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కావడం లేదని.. ఆగిందనే వార్తలు వచ్చాయి.

కారణం ఏంటంటే.. లైకా ప్రొడక్షన్స్ దర్శకుడు శంకర్ తమతో ఇండియన్-3 సినిమా చేస్తానని.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీని తమిళనాట రిలీజ్ చేస్తున్నాడని.. ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకోవాలని లైకా ప్రొడక్షన్స్ తమిళ నిర్మాతల కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో అక్కడ గేమ్ ఛేంజర్ రిలీజ్ ఆగిందని.. అందుకనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు అడ్డంకులు అన్నీ తొలగిపోయాయని తెలిసింది. గేమ్ ఛేంజర్ రిలీజ్ అందరూ అనుకుంటున్నట్లుగా సజావుగా సాగనుందని తమిళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది. జనవరి 10న ‘గేమ్ ఛేంజర్ రిలీజ్ ఖాయమని.. ఈ సినిమా రిలీజ్‌కు రూట్ క్లియర్ అయ్యిందని సదరు సంస్థ ప్రకటించింది.