ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ కు కలిసిరాలేదు. థియేటర్స్ లోకి వచ్చిన రెండు సినిమాలు మ్యాడ్ 2, రాబిన్ హుడ్ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. నితిన్ రాబిన్ హుడ్ సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ట్రైలర్ బాగుండటంతో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ భారీగా జరిగాయి. దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్ గత సినిమా భీష్మ హిట్ కావడం కూడా ఎక్స్ పెక్టేషన్స్ పెంచింది. అయితే రాబిన్ హుడ్ సినిమా చూసిన వారు మాత్రం ఈ అంచనాలను సినిమా అందుకోలేకపోయిందనే అంటున్నారు.
అనాధగా పెరిగిన హీరో తన ఆశ్రమం కోసం దొంగతనాలు చేయడం, అతన్ని పట్టుకోవడం కోసం పోలీసులు ఫీట్స్ కొత్తదనం పంచలేకపోయాయి. సెకండాఫ్ లో డ్రగ్ మాఫియాకు, మెడికల్ లైసెన్స్ కు లింక్ చేస్తూ కొత్త పాయింట్ చెప్పాలనుకున్నా అది కన్విన్సింగ్ గా లేదు. దర్శకుడు వెంకీ కుడుముల స్ట్రాంగ్ స్టోరీలో మంచి కామెడీని జనరేట్ చేస్తూ ఛలో, భీష్మ వంటి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు రాబిన్ హుడ్ లో అతని బలంగా చెప్పుకునే కథ లోపించిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ తప్ప రాబిన్ హుడ్ లో కొత్తదనం ఏదీ లేదనేది మూవీ చూసిన వారు చెబుతున్న మాట.