రివ్యూ – టామ్ అండ్ జెర్రీ

నటీనటులు – అమలన్ దాస్, హర్మన్ దీప్ కౌర్, చంద్ర మహేశ్, తోట వేణు గోపాల్, రవితేజ నిమ్మల, శ్రీకృష్ణ గొర్లె, బాలు చరణ్, సింగం మహేశ్ తదితరులు

టెక్నికల్ టీమ్ – ఎడిటర్ – ఎస్ బీ ఉద్ధవ్, సినిమాటోగ్రాఫర్ – అజిత్ బాషా, మ్యూజిక్ – ఎంఎల్పీ రాజా, రైటర్ – శివ నిర్మల, నిర్మాత – పాలేపు వెంకటేశ్వరరావు, డైరెక్టర్ – జే శ్రీ శివన్

యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామా కథతో ప్రేక్షకుల ముందుకొచ్చింది “టామ్ అండ్ జెర్రీ” సినిమా. అమలన్ దాస్, హర్మన్ దీప్ కౌర్ జంటగా నటించిన ఈ సినిమాను దర్శకుడు జే శ్రీ శివన్ రూపొందించారు. ఈ వారం విడుదలైన “టామ్ అండ్ జెర్రీ” ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథేంటంటే

లక్కీ (అమలన్ దాస్) పెద్దగా బాధ్యతలు లేని సరదాగా ఉండే కుర్రాడు. లక్కీ తన ఫ్లాట్ ను భానుమతి (హర్మన్ దీప్ కౌర్) తో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. భానుమతి ఐటీ ఉద్యోగిగా పనిచేస్తుంటుంది. ఒక డబ్బున్న యువతిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాలనేది లక్కీ ఆలోచన. మంచి ఉద్యోగం చేస్తూ ఆమెరికాలో సెటిల్ కావాలనేది భానుమతి డ్రీమ్. అయితే ఒకరోజు రాత్రి లక్కీ, భానుమతి కలిసి స్పెండ్ చేసే సందర్భం వస్తుంది. ఆ రాత్రి తర్వాత ఈ జంట జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ?. వారి మధ్య ఎలాంటి బంధం ఏర్పడింది ?. టామ్ అండ్ జెర్రీలా లక్కీ, భానుమతి ఎలా మారిపోయారు అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిన మిగతా కథ.

ఎలా ఉందంటే

టైటిల్ కు తగినట్లే హీరో హీరోయిన్ల లక్కీ, భానుమతి పాత్రలు టామ్ అండ్ జెర్రీలా ఉంటూ ప్రేక్షకులకు మంచి కామెడీ అందిస్తూ ఎంటర్ టైన్ చేస్తాయి. వారి ఈగోల వల్ల ఈ క్లాష్ ఎదురవుతుంటుంది. లక్కీ, భానుమతి పాత్రల నేపథ్యం కూడా భిన్నంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణం వల్ల లక్కీ లేజీగా, బాధ్యతలు లేనివాడిగా వ్యవహరిస్తుంటాడు. కానీ భానుమతి జీవితంలో ఎదగాలని, బాగా సంపాదించి సెటిల్ అవ్వాలని కోరుకుంటుంది. పెళ్లికి ముందు ఈ జంట మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం వారిలో కొత్త బంధాన్ని ఏర్పరుస్తుంది. ఒకరి అభిప్రాయాలను మరొకరు, ఒకరి స్వేచ్ఛను అర్థం చేసుకునేలా చేస్తుంది.

సినిమా ఇంటర్వెల్ కథకు టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. విరామ సన్నివేశం సినిమా ద్వితీయార్థంపై మరింత ఆసక్తిని పెంచుతుంది. నవ్వించే ఒక ఒప్పందంతో జరిగే హీరో హీరోయిన్ల పెళ్లి తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. సంప్రదాయ ఆలోచనలు గల హీరో, నేటి తరం ఆలోచనలు గల ఆధునిక భావాలున్న యువతి పాత్రలో హీరోయిన్ తన లైఫ్ ఎలా ముందుకు తీసుకెళ్లారు అనేది దర్శకుడు జే శ్రీ శివన్ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాడు.

టామ్ అండ్ జెర్రీలో కొత్త నటీనటులు నటించారు. దీంతో సినిమాకు ఒక ఫ్రెష్ నెస్ వచ్చింది. లీడ్ పెయిర్ అమలన్ దాస్, హర్మన్ దీప్ కౌర్ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. భానుమతి క్యారెక్టర్ లో హర్మన్ దీప్ కౌర్ తన పర్ ఫార్మెన్స్ తో పాటు గ్లామర్ గానూ కనిపించి ఆకట్టుకుంది. పూజగా కనిపించిన రూప లక్కీని ఇష్టపడే అమ్మాయిగా మెప్పించింది. దర్శకుడు చంద్రమహేశ్ హీరో అమలన్ దాస్ కు తండ్రి పాత్రలో కనిపించారు. ఆయన అడ్వకేట్ గా తన పాత్రలో ఒదిగిపోయారు. శ్రీమణి కథానాయకుడికి తల్లి పాత్రలో నటించింది. తోట వేణుగోపాల్ హీరోయిన్ హర్మన్ దీప్ కౌర్ తండ్రి పాత్రలో నటించారు. అతనో బిజినెస్ మ్యాన్. భార్యతో సఖ్యత లేని భర్తగా కనిపించారు. సుజాత హీరోయిన్ తల్లి పాత్ర పోషించింది. నిక్కర్ సత్తిగా కమెడియన్ రవితేజ నవ్వులు పూయించాడు. అతనికి కూడా అమెరికా వెళ్లి సెటిల్ కావాలనే కల ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన ఇందు తన క్యారెక్టర్ కు న్యాయం చేసింది.

శివ నిర్మల ప్రతి పాత్రకు సరిపోయేలా మంచి డైలాగ్స్ రాశారు. ఎస్ బీ ఉద్ధవ్ ఎడిటింగ్ పనితనం, ఎస్ కే సినిమాటోగ్రఫీ సినిమాను మరింత ఎలివేట్ చేశాయి. ప్రొడ్యూసర్ పాలేపు వెంకటేశ్వరరావు మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో టామ్ అండ్ జెర్రీ మూవీని నిర్మించారు. రెండు పాటల మ్యూజిక్ కంపోజిషన్, విజువల్ క్యాప్చరింగ్ లో ఆకట్టుకున్నాయి.

చివరగా

అభిప్రాయాల్లో, ఆలోచనల్లో, మనస్తత్వాల్లో భిన్నంగా ఉన్నా…తెలియని ఆకర్షణ, అనుబంధం ఒక జంటను తమ జీవితాల్లో ఎలా ఒక్కటయ్యేలా చేసింది అనే అంశాన్ని దర్శకుడు జే శ్రీ శివన్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందించి ఆకట్టుకున్నారు.

రేటింగ్ 3/5