రివ్యూ – తంగలాన్

నటీనటులు – చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు

టెక్నికల్ టీమ్ – సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్, ఎడిటింగ్ – ఆర్కే సెల్వ, స్టంట్స్ – స్టన్నర్ సామ్, నిర్మాత – కేఈ జ్ఞానవేల్ రాజా, దర్శకత్వం – పా రంజిత్

ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన మూవీస్ లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది చియాన్ విక్రమ్ తంగలాన్. పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్ తో పీరియాడిక్ డ్రామాగా దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియెన్స్ ఇంప్రెస్ చేసింది. మరి థియేటర్స్ లో తంగలాన్ ఎంతగా మెప్పించిందో రివ్యూలో చూద్దాం

కథేంటంటే

భారత స్వాతంత్య్రానికి పూర్వం వెప్పూరు అనే గ్రామంలో తంగలాన్ ( చియాన్ విక్రమ్ ) నివసిస్తుంటాడు. అతని భార్య గంగమ్మ (పార్వతీ తిరువోతు) నలుగురు పిల్లలు ఉంటారు. వెప్పూరులో భూస్వాములు దళితులను తక్కువ చేసి చూస్తుంటారు. వారి భూముల మీద భరించలేనంత పన్నులు భారంగా మోపుతుంటారు. పండిన పంట చేతికి అందే సమయంలో తగలబెడుతారు. ఈ సమయంలో బ్రిటీష్ దొర (డేనియల్) బంగారం తవ్వకాల కోసం తంగలాన్ ను పిలిపిస్తాడు. అతనికి కొంత బంగారం ఇచ్చి మరికొంతమందిని ఊరు నుంచి తవ్వకానికి తీసుకురమ్మని చెబుతాడు. తంగలాన్ బ్రిటీష్ దొర ఇచ్చిన డబ్బుతో తన భూమి తనఖా నుంచి విడిపించుకుంటాడు. ఊరి వాళ్లు కూడా తనలాగే బంగారం తవ్వకం పనికి వస్తే సంపాదించుకుని బాగుపడొచ్చని చెబుతాడు. తంగలాన్ మాట విని ఊరి వాళ్లంతా బంగారం తవ్వకానికి వెళ్తారు. వారు అనుకున్నట్లు బంగారం దొరికిందా, ఈ తవ్వకం పనికి సర్పజాతి నాయకురాలు ఆరతి (మాళవిక మోహనన్) ఎలాంటి అడ్డంకులు సృష్టించింది. తంగలాన్ కు అరణ్య కు సంబంధం ఏంటి అనేది తెరపై చూడాలి.

ఎలా ఉందంటే

సమాజంలో కులవివక్ష గురైన కొన్ని వర్గాల ఇబ్బందులను ప్రధాన అంశంగా తీసుకుని దాని చుట్టూ ఫాంటసీ వరల్డ్ ను క్రియేట్ చేశారు దర్శకుడు పా రంజిత్. ప్రథమార్థంలో తంగలాన్ ను, అతని కుటుంబాన్ని, ఊరును, భూస్వాముల నుంచి తంగలాన్ తో పాటు అతని లాంటి అణగారిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూపించారు. తంగలాన్ కలలో వచ్చే ఆరతి గురించి చెప్పిన ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో కథలో ఆసక్తి పెరుగుతుంది. బంగారం కోసం తంగలాన్ వంశీకులు ఎలాంటి పోరాటం చేశారనేది ఆ ప్లాష్ బ్యాక్ ద్వారా రివీల్ చేసిన తీరు బాగుంది. బ్రిటీష్ దొర తంగలాన్ ను బంగారం వేటలో పనికి పిలిచినప్పటి నుంచి అసలు స్టోరీ బిగిన్ అవుతుంది. బంగారం తవ్వకానికి తన ఊరి వారిని తంగలాన్ ఒప్పించేందుకు చెప్పిన డైలాగ్స్ సినిమా ఫస్టాఫ్ కు హైలైట్ గా నిలుస్తాయి.

ఆరతి, అరణ్య క్యారెక్టర్స్ ను కథలోకి తీసుకొచ్చిన తీరు ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు కలిగిస్తుంది. మ్యాజికల్ రియలిజం అనే కాన్సెప్ట్ ను దర్శకుడు పా రంజిత్ ఈ సినిమా కోసం ఉపయోగించారు. తంగలాన్ ప్రారంభం నుంచీ అనేక మలుపులతో కథ సాగుతుంది. స్క్రీన్ ప్లే ఆసక్తిని కలిగిస్తుంది. దర్శకుడు పా రంజిత్ కథా కథనాలను తనదైన ముద్రతో రూపొందించాడు. తంగలాన్ సినిమా చూస్తున్నంత సేపూ మనం విక్రమ్ ను, మాళవికను, పార్వతీ తిరువోతులను మర్చిపోతాం. ఆ పాత్రలు మాత్రమే చూడగలుగుతాం. కథలో ప్రేక్షకుల్ని లీనం చేసినప్పుడు ఇది సాధ్యమవుతుంది. తంగలాన్ ఆ మ్యాజిక్ క్రియేట్ చేయగలిగింది.

తంగలాన్ టైటిల్ రోల్ లో విక్రమ్ ఎంతో సహజంగా నటించాడు. ఈ సినిమా కోసం అతను పడిన కష్టం తెరపై కనిపిస్తుంటుంది. మరో కీ రోల్ కూడా విక్రమ్ చేశాడు. అది తెరపై చూడాలి. గంగమ్మగా పార్వతీ తిరువోతు మారిపోయింది. ఆమె గురించి తెలియని వారు ఆమె పార్వతీ తిరువోతు కాదు గంగమ్మే అనుకుంటారు. అందానికి మారుపేరుగా చెప్పుకునే మాళవిక మోహనన్…తంగలాన్ లో ఆరతిగా ఓ సరికొత్త పాత్రలో నటించి మెప్పించింది. ఆమె కెరీర్ లో గుర్తుండిపోయే డిఫరెంట్ రోల్ ఇది.

టెక్నికల్ గా తంగలాన్ ఒక హై క్వాలిటీ మూవీ. జీవీ ప్రకాష్ కుమార్ పాటలు, బీజీఎం ఆకర్షణగా నిలుస్తాయి. నిడివి కొంచెం ఎక్కువైనా కథతో పాటే ట్రావెల్ అయ్యే ప్రేక్షకులు దాన్ని పట్టించుకోరు. ఆర్ట్ వర్క్ సహజంగా ఉంది. విజువల్ ఎఫెక్టులకు ప్రాధాన్యమున్న కథ ఇది. మంచి క్వాలిటీ సీజీ వర్క్ తంగలాన్ ఫాంటసీ వరల్డ్ ను తెరపై ఆవిష్కరించింది. మొత్తానికి తంగలాన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక అరుదైన సినిమా అని చెప్పాలి.

రేటింగ్ 3.25/5