నటీనటులు – కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష నెల్లూరు సుదర్శన్
టెక్నికల్ టీమ్ – సంగీతం : అమ్రిష్ గణేష్, డీఓపీ: దులీప్ కుమార్, ఎడిటర్ : వరప్రసాద్, సమర్పణ: ఏఎం రత్నం, నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి, రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
స్టార్ హీరో కాకపోయినా, స్టార్ హీరోనే అనుకుంటాడు కిరణ్ అబ్బవరం. ఈ భ్రమలో స్టార్ హీరోలు చేయాల్సిన కథలతో సినిమాలు చేసి ఇబ్బందిపడ్డాడు. ఇక నుంచి అలాంటి కథల జోలికి పోనంటూ ఈ మధ్య స్టేట్ మెంట్ ఇచ్చాడు. కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ సినిమా ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంది. థియేటర్ లో ఇదే ఇంపాక్ట్ ఇవ్వగలిగిందా లేదా రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) ఉద్యోగ ప్రయత్నం మీద తన ఊరు తిరుపతి నుంచి ముంబై వెళ్తాడు. అక్కడ హిందీ వచ్చని చెప్పి అబద్ధమాడి ఉద్యోగం సంపాదిస్తాడు. హిందీ రాకపోవడంతో ఆఫీస్ లో తోటి ఉద్యోగుల నుంచి అవమానాలు ఎదుర్కొంటాడు. అయితే బాస్ సపోర్ట్ తో మనో రంజన్ ఆఫీస్ లో ఎదుగుతాడు. తోటి ఉద్యోగులు తన రూల్స్ ప్రకారం పనిచేయాలని ఆదేశిస్తాడు. అప్పటి నుంచి అతన్ని రూల్స్ రంజన్ అని పిలుస్తారు. ఇంతలో మనో రంజన్ కు సనా (నేహా శెట్టి) ముంబైలో పరిచయం అవుతుంది. ఈ సనా ఎవరు, ఈమెతో మనో రంజన్ కు ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆమెను ప్రేమించిన మనో రంజన్ పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
కథ కంటే సన్నివేశాలు, వాటి ద్వారా వచ్చే కామెడీ మీద ఆధారపడిన సినిమా ఇది. తిరుపతి నుంచి మనో రంజన్ ఉద్యోగం కోసం ముంబై చేరుకోవడం, అక్కడ ఆఫీస్ లో హిందీ రాక ఇబ్బంది పడటం రొటీన్ అనిపిస్తుంటుంది. మనో రంజన్ కు కామేశ్ (వెన్నెల కిషోర్) పరిచయం అయ్యాక కథకు కాస్త కనెక్ట్ అవుతారు ప్రేక్షకులు. వీరి మధ్య వచ్చే సీన్స్ నవ్విస్తాయి. సనా ముంబైలో పరిచయం అవడం, మనో రంజన్ కు ఆమెతో కాలేజ్ డేస్ నుంచే లవ్ ఉందని తెలియడంతో కథ రొమాంటిక్ టర్న్ తీసుకుంటుంది. మనో రంజన్ ను లవ్ చేస్తుంది సనా. అయితే ఆమె తిరుపతి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆమెను వెతుక్కుంటూ మనో రంజన్ తిరపతి వెళ్తాడు. మనో రంజన్, సనా ప్రేమను, పెళ్లిని అడ్డుకునేందుకు వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, హైపర్ ఆది తో కూడిన ఓ బ్యాచ్ చేసే ప్రయత్నాలు హ్యూమర్ పంచుతాయి.
మనో రంజన్, సనా ప్రేమ కథ ఆకట్టుకోదు. సనాకు మరొకరితో పెళ్లి చేయాలని ఆమె అన్న ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ పెళ్లిని మనో రంజన్ అడ్డుకోవడం కూడా నస కార్యక్రమంలా అనిపిస్తుంటుంది. కొన్ని మలుపులు తిరిగిన తర్వాత మనో రంజన్, సనా ఒక్కటవడం కూడా రొటీన్ ఫీల్ ఇస్తుంది. మనో రంజన్ గా కొన్ని చోట్ల కిరణ్ అబ్బవరం నటన ఆకట్టుకుంటుంది. సనా క్యారెక్టర్ లో నేహా శెట్టి పర్ ఫార్మెన్స్ కన్నా, గ్లామర్ తో ఆకర్షించింది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఫస్టాఫ్ కు బలంగా మారింది. అతనితో ఫన్ లేకుంటే ఫస్టాఫ్ విసిగించేది. సెకండాఫ్ లో హైపర్ ఆది, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్ నవ్వించే ప్రయత్నం చేశారు. మ్యూజిక్ పరంగా సమ్మోహనుడా పాట బాగుంది.