నటీనటులు ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల
సాంకేతిక వర్గం – బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్, రైటర్, ఎడిటర్ అండ్ డైరెక్టర్: శ్రీనాథ్ పులకురం, నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి, డి.ఒ.పి : నిఖిల్ సురేంద్రన్, ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్, పాటలు: కార్తీక్ రోడ్రిగజ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సయ్యద్ కమ్రాన్
ప్రేమ కథల్లోని ఎమోషన్ వర్కవుట్ అయితే ఆ సినిమాలకు తిరుగుఉండదు. ఆ సినిమాలో నటించి కొత్త వాళ్లా, బడ్జెట్ తక్కువుందా, అనేది ఎవరూ పట్టించుకోరు. అలాంటి యూత్ ఫుల్ హార్ట్ టచింగ్ ప్రేమ కథగా తెరకెక్కి ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
కథేంటంటే
పుంగనూరులో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో చదివే కుర్రాడు వాసు (ప్రణవ్ ప్రీతం). వాసుది పేద కుటుంబం. తల్లి కూలి పనులు చేస్తూ వాసును చదివిస్తుంటుంది. అతని తండ్రి తాగుబోతు. వాసుకు ఇద్దరు స్నేహితులు ఉంటారు. కాలేజ్ లో కుమారి (షాజ్ఞ శ్రీ వేణున్) అంటే అబ్బాయిలకు పిచ్చి క్రేజ్. ప్రతి కుర్రాడు కుమారితో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటారు. ఒక రోజు వాసు కుమారిని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా ఆమె ప్రేమలో పడిపోతాడు. ఆమెను ఎవరైనా ఏదైనా అంటే గొడవపడేంతగా ప్రేమిస్తాడు. స్కూల్ ఫస్ట్ వచ్చేంత బాగా చదివే వాసు ఆ చదువు పక్కనపెట్టి కుమారి ప్రేమలో మునిగిపోతాడు. ఏ అమ్మాయినీ కన్నెత్తి చూడని వాసు గురించి తెలుసుకున్న కుమారి అతన్ని ఇష్టపడటం మొదలుపెడుతుంది. వీళ్ల స్నేహం క్రమంగా ప్రేమగా మారుతుంది. తొలి ప్రేమ అనుభూతులను ఈ జంట ఎంజాయ్ చేస్తుంటారు. కుమారి కోసం ఇంట్లో డబ్బులు తెచ్చి బైక్ కొంటాడు వాసు. కొన్ని సంఘటనల వల్ల వీరి మధ్య అపార్థాలు ఏర్పడతాయి. ఒకసారి కుమారి మరో అబ్బాయితో మాట్లాడుతుండగా వాసు చూస్తాడు. కుమారిని ఆ విషయం అడుగుతాడు. తప్పుగా అర్థం చేసుకున్నావంటూ బాధపడిన కుమారి వాసుకు దూరమవుతుంది. కుమారి నిజంగానే ఆ అబ్బాయిని ప్రేమించిందా, వాసు ఆమెను అపార్థం చేసుకున్నాడా, వాసు కుటుంబంలో జరిగిన ఘటనలు ఏంటి అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
పుంగనూరు అనే ఊరి కాలేజ్ లో జరిగే అందమైన ప్రేమ కథ ఇది. హీరో హీరోయిన్ల పాత్రల పరిచయాలు, ఊరి ఆహ్లాదకర పరిసరాలు, కాలేజ్ లో స్నేహితులతో వాసు చేసే కామెడీ…ఇలా సరదాగా సినిమా మొదలై సాగుతుంటుంది. కుమారి ఎంట్రీతో వాసు లవ్ స్టోరీ మొదలవుతుంది. ఈ లవ్ స్టోరీ క్యూట్ ఫీలింగ్ కలిగిస్తుంది. వాసు ఇద్దరు స్నేహితులు, కుమారి, ఆమె స్నేహితురాలి మధ్య వచ్చే కాలేజ్ సీన్స్ థియేటర్ లో ఒక హ్యాపీ మూడ్ క్రియేట్ చేస్తాయి. వాసు, కుమారి లవ్ మొదలయ్యాక ఈ జంట మధ్యే ప్లెజెంట్ గా సీన్స్ వెళ్తుంటాయి. మరోవైపు వాసు కుటుంబ పరిస్థితిని, కుమారి కుటుంబ పరిస్థితిని పరిచయం చేస్తాడు దర్శకుడు. వీళ్లిద్దరి కుటుంబాలు భిన్నమైన నేపథ్యంతో ఉంటాయి. ఆ బ్యాక్ గ్రౌండ్ కూడా ఎంతో న్యాచురల్ గా ఉంటుంది.
వాసు, కుమారి మధ్య రొమాన్స్ కు ఎంత ఛాన్స్ ఉన్నా..దర్శకుడు శ్రీనాథ్ పులకురం సకుటుంబంతో కలిసి సినిమా చూసేలా హుందాగా తెరకెక్కించాడు. ఎక్కడా హద్దులు దాటిన ఇంటిమసీ పెట్టలేదు. ఒక పెద్ద దర్శకుడికి ఉండే లక్షణం ఇది. కుమారి వాసు మధ్య అపార్థానికి దారి తీసే సన్నివేశాలు కన్విన్సింగ్ గా ఉన్నాయి. ఈ కథలో ప్రత్యేకంగా విలన్స్ ఎవరూ ఉండరు. విలన్ ఎవరు అనేది తెలిశాక సర్ ప్రైజ్ అవుతారు. యువత జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనిపై దృష్టి పెట్టాలి అనే సందేశాన్ని చెప్పకనే చెప్పాడు దర్శకుడు శ్రీనాథ్.
ఈ సినిమాలో కామెడీ, ట్రాజెడీ, లవ్ ఎలిమెంట్స్, క్యూట్ రొమాన్స్, ఎంటర్ టైన్ మెంట్స్ అన్నీ ఉన్నాయి. పాటలు ఈ సినిమాకు మరో ప్రత్యేకత. కార్తీక్ రోడ్రిగజ్ పాటలు హార్ట్ టచింగ్ గా కంపోజ్ చేశాడు. సయ్యద్ కమ్రాన్ బీజీఎం 96 సినిమాను గుర్తుచేసింది. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది. (హీరో పెట్రోల్ తీసుకుని హీరోయిన్ గుర్తులను గోడపై చెరిపేందుకు వెళ్తున్న సీన్ లోని విజువల్స్ హాలీవుడ్ మూవీస్ ను గుర్తుచేస్తాయి.) సినిమాకు ఇచ్చిన ముగింపు హుందాగా ఉంది. తొలి ప్రయత్నంలోనే నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి ఒక మంచి సినిమా రూపొందించాడు. ఓ చిన్న పాత్రలో ఆయన నటించాడు కూడా. దర్శకుడు శ్రీనాథ్ పులకురం ఫ్యూచర్ లో క్లాసిక్ సినిమాలు చేస్తాడు. ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ, రామ్ పటాస్..ఇలా కాస్టింగ్ అంతా పర్ ఫెక్ట్ గా పర్ ఫార్మ్ చేశారు. యూత్ ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చూసి ఎంజాయ్ చేసే సినిమాగా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′పేరు తెచ్చుకుంటుందని చెప్పవచ్చు.