రివ్యూ – నరకాసుర

నటీనటులు : రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్, శతృ, నాజర్, చరణ్ రాజ్, తేజ చరణ్ రాజ్, శ్రీమాన్, గాయత్రి రవిశంకర్ తదితరులు

సాంకేతిక నిపుణులు : ఎడిటింగ్ – సిహెచ్ వంశీకృష్ణ, సినిమాటోగ్రఫీ – నాని చమిడిశెట్టి, సంగీతం – ఏఐఎస్ నాఫాల్ రాజా, యాక్షన్ – రోబిన్ సుబ్బు, నిర్మాత – డాక్టర్ అజ్జా శ్రీనివాస్
సహ నిర్మాత – కారుమూరు రఘు, రచన, డైరెక్షన్ – సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్

లండన్ బాబులు, పలాస వంటి చిత్రాలతో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్నారు యంగ్ హీరో రక్షిత్ శెట్టి. ఈ అంచనాల మధ్యే ప్రేక్షకుల ముందుకొచ్చింది ఆయన కొత్త సినిమా నరకాసుర. మరి ఈ సినిమా థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

ఆంధ్ర, తమిళనాడు బార్డర్ లో ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. ఆ సమీప గ్రామం పులికండ్రిగలో ఉండే శివ (రక్షిత్ శెట్టి) అనే యువకుడు కాఫీ ఎస్టేట్ లో లారీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అతనికి సూపర్ వైజర్ గా నాజర్ ఉంటాడు. శివ ఊరి మంచి కోసం ఆలోచిస్తాడు. స్థానికఎమ్మెల్యే నాగమనాయుడు (చరణ్ రాజ్)తో శివకు మంచి రిలేషన్ ఉంటుంది. నాగమనాయుడుకి అవసరమైన పనులు చేస్తాడు శివ. మరదలు వీరమణి (సంగీర్తన విపిన్) వెంటపడినా పట్టించుకోని శివ.. మీనాక్షి (అపర్ణ జనార్థన్)ని ప్రేమిస్తాడు. ఒకరోజు మీనాక్షితో బయటకు వెళ్తాడు శివ. శివ ఎమయ్యాడని ఊరంతా వెతుకుతుంటారు. శివ, మీనాక్షికి శివుడిని పూజించే అర్థనారీశ్వరులను కనిపిస్తారు. వారిని చూసిన తర్వాత శివలో వచ్చిన మార్పేమిటి. శివ, మీనాక్షి ప్రేమకు ఎమ్మెల్యే నాగమనాయుడు కొడుకు ఆదినాయుడు (తేజ్ చరణ్ రాజ్)కు ఎందుకు అడ్డుపడ్డాడు. ఈ కథలో కేశవ (శత్రు) పాత్ర ఏంటి అనేది తెరపై చూడాలి.

ఎలా ఉందంటే..

హీరోయిజం, ప్రేమకథ, సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ ఉన్న కథ నరకాసుర. టైటిల్, టీజర్, ట్రైలర్ చూసి ఇది రా..అండ్ రస్టిక్ మూవీ అనే ఇంప్రెషన్ కలిగినా..సినిమా చూస్తే అన్ని అంశాలున్న కొత్త తరహా ప్రయత్నమని అర్థమవుతుంది. శివ కోసం ఊరి జనం వెతుకుతుండటంతో మొదలయ్యే సినిమా ప్రారంభం నుంచీ ఆసక్తిని కలిగిస్తుంది. శివ క్యారెక్టర్ ను అలా బిగినింగ్ నుంచే ఎలివేట్ చేశాడు దర్శకుడు సెబాస్టియన్. కాఫీ ఎస్టేట్ లో కూలీలను కాపాడేందుకు శివ చేసే పనులు. మరోవైపు మరదలు వీరమణితో సరదాగా సాగే సీన్స్ తో సినిమా ప్లెజంట్ గా మొదలవుతుంది. నాగమనాయుడు కోసం శివ చేసే రిస్కులు, మీనాక్షితో లవ్ సీన్స్ నరకాసుర సినిమాను ఇంటర్వెల్ వరకు ఇంట్రెస్టింగ్ గా, గ్రిప్పింగ్ గా తీసుకెళ్తాయి. సెకండాఫ్ లో హిజ్రాల జీవన విధానం, వారి మనస్తత్వం, మంచితనం చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సెబాస్టియన్. ఇప్పటిదాకా ట్రాన్స్ జెండర్స్ ను ఇంత పాజిటివ్ కోణంలో చూపించిన సినిమా రాలేదు. సమాజం హిజ్రాలను ఎంత చిన్న చూపు చూస్తుందో ఎమోషనల్ గా తెరకెక్కించాడు. వారిని మనలానే మనుషులుగా చూడాలనే మంచి సందేశం ఈ సినిమాలో ఉంది. అర్థనారీశ్వరులకు ఉపాధి కల్పించి వారిని బాగుచేసేందుకు కథానాయకుడు శివ చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి.

ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులను హైలైట్ గా చెప్పుకోవచ్చు. వాటి మేకింగ్ హై స్టాండర్డ్స్ లో ఉంది. సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ అదిరిపోయింది. దర్శకుడు సెబాస్టియన్ యాక్షన్, ఎమోషన్, లవ్, ఎంటర్ టైన్ మెంట్ వంటి అంశాలను ప్రతిభావంతంగా డీల్ చేశాడు. శివ క్యారెక్టర్ లో రక్షిత నటన అతని కెరీర్ కు మైల్ స్టోన్ అనుకోవచ్చు. ఈ సినిమాతో రక్షిత్ పలాసను మించిన పేరు తెచ్చుకుంటాడని అనుకోవచ్చు. అపర్ణ జనార్థన్, సంగీర్తన్ విపిన్, శత్రు, చరణ్ రాజ్, తేజ్ చరణ్ రాజ్..వంటి ఆర్టిస్టులంతా తమ క్యారెక్టర్స్ లా మారిపోయి నటించారు. ఈ యాక్షన్, ఎమోషనల్ కంటెంట్ కు తగిన ఎంటర్ టైన్ మెంట్ తో సినిమా కంప్లీట్ మూవీ చేసిన ఫీలింగ్ కలిగిస్తుంది.

రేటింగ్ 3.5/5