రివ్యూ – నా సామి రంగ

నటీనటులు – నాగార్జున, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, రుక్సర్ థిల్లాన్, రావు రమేష్, నాజర్ తదితరులు

టెక్నికల్ టీమ్ – సంగీతం: ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రఫీ : శివేంద్ర దాశరధి, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకత్వం: విజయ్ బిన్ని

సంక్రాంతికి రిలీజైన మూడు పెద్ద సినిమాల్లో ఒకటి నా సామి రంగ. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మలయాళ రీమేక్ గా దర్శకుడు విజయ్ బిన్నీ రూపొందించిన ఈ సినిమా ఆడియెన్స్ ను ఆకట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

అనాథ అయిన కిష్టయ్య (నాగార్జున)ను అంజి (అల్లరి నరేష్) తల్లి చేరదీస్తుంది. కిష్టయ్య, అంజి అన్నదమ్ముల్లా పెరుగుతారు. అంజి తల్లి చనిపోయిన తర్వాత ప్రెసిడెంట్ పెద్దయ్య (నాజర్) వీళ్లిద్దరికీ అండగా నిలబడతాడు. చిన్నప్పుడే వరాలు (అషికా రంగనాథ్)ను ప్రేమిస్తాడు కిష్టయ్య. ఆమె చదువులు కోసం వెళ్లిపోయి 15 ఏళ్ల తర్వాత తిరిగి ఊరికి వస్తుంది. అప్పుడు మళ్లీ వీరి ప్రేమ కథ తిరిగి మొదలవుతుంది. పెద్దయ్య కొడుకు దాసుకు వరాలును ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రి వరదరాజులు అనుకుంటాడు. అయితే కిష్టయ్య వరాలు ప్రేమ గురించి తెలిసిన పెద్దయ్య..తన కొడుకుతో వరాలు పెళ్లి ఆపేసి, కిష్టయ్యతో వివాహం జరిపించమని వరదరాజులుకు చెబుతాడు. మరి వరదరాజులు పెద్దయ్య మాట విన్నాడా, వరాలు కిష్టయ్య పెళ్లి జరిపించాడు లేదా. ఈ కథకు భాస్కర్ (రాజ్ తరుణ్) ప్రేమ కథతో లింక్ ఏంటి అనేది తెరపై చూడాలి.

ఎలా ఉందంటే

ఓ మలయాళ సూపర్ హిట్ సినిమాను రీమేక్ గా తీసుకుని నా సామి రంగ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు విజయ్ బిన్ని. ఈ సినిమాకు రైటింగ్ మొత్తం బెజవాడ ప్రసన్న కుమార్ చేశాడు. ఈ సినిమాను తెలుగు నేటివిటికీ బాగానే మార్చినా..ఇలాంటి స్నేహం, ప్రేమ, ప్రతీకారం కథలు తెలుగులో చాలానే వచ్చాయి. దాంతో నా సామి రంగ లాంటి సినిమా ప్రేక్షకులకు కొత్తగా అనిపించదు. పాత కథే అయినా దాన్ని దర్శకుడు కొత్తగా ప్రెజెంట్ చేయలేకపోయాడు. చిన్ననాటి సీన్స్ తో కథ ఇంట్రెస్టింగ్ మొదలవుతుంది. అలాగే యాక్షన్ సీక్వెన్సులు, హీరోయిజంతో సాగుతుంటుంది. కథలోకి ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అవడానికి చాలా సమయం తీసుకోవడం ఈ సినిమాకు మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి నా సామి రంగ కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సెకండాఫ్ లో పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి సినిమా వెళ్లిపోతుంది. సాగదీతగా ఉన్న స్క్రీన్ ప్లే ఈ సినిమాకు లోపంగా చెప్పుకోవచ్చు. కిష్టయ్య క్యారెక్టర్ లో నాగార్జున నటన బాగుంది. యాక్షన్, సాంగ్స్, రొమాన్స్ వంటి అంశాల్లో ఆయన ఎప్పటిలాగే తన బెస్ట్ ఇచ్చాడు. అల్లరి నరేష్ కు అంజి క్యారెక్టర్ టైలర్ మేడ్. ఆయన పర్ ఫార్మెన్స్ కూడా కుదిరింది. రాజ్ తరుణ్, రావు రమేష్, ఆషికా రంగనాథ్ తన క్యారెక్టర్స్ మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ గా కీరవాణి నేపథ్య సంగీతం, పాటలు ఆకర్షణగా నిలుస్తాయి. ఫైనల్ గా నా సామి రంగ సినిమాను ఓసారి సరదాగా టైమ్ ఉంటే చూడొచ్చు..కానీ పనిగట్టుకుని చూసి తీరాల్సిన సినిమా మాత్రం కాదు.