నటీనటులు – సొహైల్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష, స్వప్నిక, అభిషేక్ రెడ్డి బొబ్బల తదితరులు
టెక్నికల్ టీమ్ – సినిమాటోగ్రఫీ – నిజార్ షఫీ, సంగీతం – శ్రావణ్ భరద్వాజ్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, నిర్మాతలు – అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి. రచన-దర్శకత్వం – శ్రీనివాస్ వింజనంపాటి.
డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేసేందుకు ధైర్యం కావాలి. అలాంటి సాహసం చేయగల ప్రొడక్షన్ మైక్ మూవీస్. ఈ బ్యానర్ ఇప్పటిదాకా నిర్మించిన సినిమాలన్నీ ప్రేక్షకులకు కొత్తదనం పంచినవే. మైక్ మూవీస్ నిర్మించిన కొత్త సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ ఇవాళ రిలీజైంది. సోహైల్, రూపా కొడవయూర్ జంటగా దర్శకుడు వింజనంపాటి శ్రీనివాస్ రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే.
టాటూ ఆర్టిస్ట్ గౌతమ్ (సోహైల్) అంటే మహీకి (రూపా కొడవయూర్)కు చాలా ఇష్టం. చదువుకునే రోజుల నుంచి అతన్ని ప్రేమిస్తుంది. ప్రేమ పెళ్లికి దూరంగా ఉండాలనుకునే గౌతమ్ కు మాత్రం మహీ అంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో మహీని పెళ్లి చేసుకుంటాడు గౌతమ్. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. కొన్ని రోజులకు మహీకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ఆ ప్రెగ్నెన్సీని తాను తీసుకోవాలనుకుంటాడు గౌతమ్. విదేశాల్లో ఇలాంటి ప్రయోగాలు సక్సెస్ అయ్యాయని తెలుసుకుని డాక్టర్ వసుధ (సుహాసినీ) సహాయంతో ఆ ప్రెగ్నెన్సీ తీసుకుని మిస్టర్ ప్రెగ్నెంట్ అవుతాడు. ప్రెగ్నెంట్ గా అతని జీవితం ఎలాంటి మలుపులతో సాగింది అనే ఆసక్తికర అంశాలు తెరపై చూడాలి.
ఎలా ఉందంటే.
హిళల గొప్పదనాన్ని చెబుతూ సాగే చిత్రమిది. ముఖ్యంగా అమ్మ పిల్లల కోసం ఎంతటి త్యాగాలు చేస్తుంది అనేది చూపించారు. అమ్మ గొప్పతనాన్ని హీరో గౌతమ్ క్యారెక్టర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మూవీ స్టార్టింగ్ కొంత సరదాగా సాగుతూ వెళ్లినా గౌతమ్ ప్రెగ్నెన్సీ తీసుకునేందుకు సిద్ధపడినప్పటి నుంచి ప్రేక్షకులు కథలో లీనమవుతారు. మేల్ ప్రెగ్నెన్సీ కోసం దర్శకుడు ఎగ్జాంపుల్ గా చెప్పిన సైంటిఫిక్ రీజన్స్ అన్నీ ఆసక్తికరంగా అనిపిస్తాయి. మేల్ ప్రెగ్నెన్సీ గురించి కనీస అవగాహన ప్రేక్షకుల్లో కలిగిస్తాయి. ప్రెగ్నెన్సీ టైమ్ నుంచి గౌతమ్, మహీ మధ్య వచ్చే సన్నివేశాలన్నీ చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. మన జీవితంలో మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనే చెబుతూ రాసిన మాటలు ఆకట్టుకున్నాయి. కథ పరంగా ఇది పూర్తిగా భిన్నమైన సినిమా. ప్రచార కార్యక్రమాల్లో నిర్మాతలు చెప్పినట్లు ఈ కాన్సెప్ట్ తో సినిమాలు చేయడం కత్తి మీద సాము లాంటిదే. ఆ ప్రయత్నాన్ని సక్సెస్ ఫుల్ గా చేశారు దర్శక నిర్మాతలు.
సోహైల్ కు నటుడిగా మంచి పేరే తెచ్చే సినిమా ఇది. అతని స్టైలిష్ లుక్స్, మేల్ ప్రెగ్నెంట్ గా చూపించిన ఎక్స్ ప్రెషన్స్, ఎమోషన్స్ కనబర్చిన తీరు ఇంప్రెస్ చేస్తుంది. అగ్రెసివ్ గా కనిపించే సోహైల్ లో ఇంత ఎమోషనల్ యాక్టర్ ఉన్నాడా అనిపిస్తుందీ సినిమా. రూపా కొడవయూర్ ఈ సినిమాకు కరెక్ట్ ఆప్షన్. తెలుగమ్మాయి కాబట్టి మన నేటివిటీ, మన ఎమోషన్స్ సరిగ్గా తన నటనలో చూపించింది. డాక్టర్ వసుధగా సుహాసినీ క్యారెక్టర్ కథలో కీలకంగా ఉంది. అలాగే బ్రహ్మాజీ, వైవా హర్ష తమ కామెడీతో నవ్వించారు. టెక్నికల్ గా చూస్తే నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, శ్రావణ్ భరద్వాజ్ సంగీతం మెయిన్ అస్సెట్స్ గా నిలుస్తాయి. ఇలా అన్ని అంశాలతో మెప్పిస్తుంది మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు, మూవీ లవర్స్ ఈ సినిమాను థియేటర్ లో చూడొచ్చు.