రివ్యూ – “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”

న‌టీన‌టులు: న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి తదితరులు

సాంకేతిక బృందం – సంగీతం : రధన్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్ర‌ఫీ: నిర‌వ్ షా, బీజీఎం : గోపీ సుందర్, బ్యానర్ : యూవీ క్రియేషన్స్, నిర్మాతలు : వంశీ, ప్రమోద్, రచన దర్శకత్వం : మహేశ్ బాబు.పి.

యూత్ ఫుల్ మూవీస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఇవి రెండు వేటికవి భిన్నమైనవి. వీటిలో ఏదో ఒక జానర్ మూవీస్ తెరపైకి రావడం చూస్తుంటాం. కానీ యూత్ ఫుల్ కథతో ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించేలా సినిమా చేయడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి అరుదైన ప్రయత్నమే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో చేశారు దర్శకుడు మహేశ్ బాబు. పి. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా తెరపై ఆకట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

లండన్ లో మాస్టర్ చెఫ్ గా పనిచేస్తున్న అన్విత రవళి శెట్టి (అనుష్క) తల్లికి తీవ్ర అనారోగ్యం కారణంగా ఇండియాకు తిరిగొస్తుంది. ఆమె స్వతంత్ర భావాల గల యువతి. మ్యారేజ్ అనే బాండింగ్ లో ఇరుక్కోవడం ఆమెకు ఇష్టం ఉండదు. అన్విత పెళ్లి కాకుండానే తల్లిగా హ్యాపీనెస్ పొందాలనుకుంటుంది. సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే సిద్ధు పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి) స్టాండప్ కమెడియన్ గా షోస్ చేస్తుంటాడు. అతన్ని చూసి ఇంప్రెస్ అవుతుంది అన్విత. సిద్ధు ఆమె ప్రేమలో పడతాడు. అన్విత తన మనసులోని ఆలోచన చెప్పినప్పుడు సిద్ధు షాక్ అవుతాడు. ఓ సగటు యువకుడిలా ఆలోచించే సిద్ధుకు అన్విత నిర్ణయం నచ్చదు. ఆమెను ప్రేమిస్తున్నాడు కాబట్టి కాదనలేడు. పెళ్లి కాకుండా తల్లి అవ్వాలనే అన్విత నిర్ణయం వెనక కారణం ఏంటి? సిద్ధు ఆమె నిర్ణయానికి అంగీకారం తెలిపాడా? లేదా? ఈ జంట ప్రయాణం చివరకు ఎలా సాగింది? అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

యాక్షన్ మూవీస్, రొటీన్ లవ్ స్టోరీస్ ట్రెండ్ నడుస్తున్న ఈ టైమ్ లో ఒక ఫ్రెష్ కథను తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు మహేశ్ బాబు.పి. యూత్ ఫుల్ కథైనా ఎక్కడా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఇబ్బంది పెట్టకుండా తెరకెక్కించి తన ప్రతిభ చూపించాడు. ఇదొక ఫ్రెష్ రొమాంటిక్ ఎంటర్ అని చెప్పవచ్చు. సింగిల్ పేరెంటింగ్, పెళ్లి గురించిన అంశాలు ఉన్నాయి. ఈ కథను సిద్ధు, అన్విత అనే రెండు క్యారెక్టర్స్ ఫిల్లర్స్ గా మోశాయి. సిద్ధు క్యారెక్టర్ లో నవీన్ పోలిశెట్టి తన కామెడీ టైమింగ్, పర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. ఫన్ తో పాటు తన పర్ ఫార్మెన్స్ లో ఎమోషన్ కూడా ఆకట్టుకునేలా పలికించాడు. అనుష్క శెట్టి కొంత విరామం తర్వాత మన ముందుకొచ్చింది. ఆమె అన్విత క్యారెక్టర్ కు యాప్ట్ గా కనిపించింది. ఈ క్యారెక్టర్ అనుష్క మాత్రమే చేయగలదు అనిపించింది. మోడరన్, ఇండిపెండెంట్ వుమెన్ గా అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. నవీన్, అనుష్క పెయిర్ తెరపైకి ఫ్రెష్ ఫీలింగ్ తీసుకొచ్చింది. ఇక సపోర్టింగ్ రోల్స్ లో మురళీ శర్మకు ఎక్కువ మార్కులు పడతాయి. ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశాల్లో ఆయన నటన బాగుంది. సోనియా, అభినవ్ గోమటం క్యారెక్టర్స్ పర్వాలేదనిపిస్తాయి. సాంకేతికంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి స్ట్రాంగ్ గా ఉంది. రధన్ అందించిన పాటలు, గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకున్న హైలైట్స్ లో ఒకటిగా మారాయి. నీరవ్ షా సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ చేసింది. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ కథకు కావాల్సినవన్నీ తెరపైకి తీసుకొచ్చాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తెలుగు తెరపై ఒక కొత్త ప్రయత్నం అని చెప్పొచ్చు. ఇదొక ట్రెండ్ సెట్టర్ మూవీ. ఎంతోమంది కొత్త దర్శకులను ఇన్ స్పైర్ చేయగల కంటెంట్ ఈ సినిమాలో ఉంది.

చివరగా – “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”…మిస్ కాకండి

రేటింగ్ 3.25/5