నటీనటులు – పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్ తదితరులు
టెక్నికల్ టీమ్ – సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర, మ్యూజిక్ : అజనీష్ లోక్‌నాథ్, ఎడిటర్ : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, రాఘవ్, నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, దర్శకత్వం : అజయ్ భూపతి.
పాయల్ రాజ్ పుత్ స్టార్ హీరోలతో సినిమాలు చేసినా ఆర్ఎక్స్ 100 సినిమా ఒక్కటే ఇప్పటికీ గుర్తుంటుంది. దర్శకుడు అజయ్ భూపతి చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. ఈ కాంబోలో పాయల్ రాజ్ పుత్ తో అజయ్ భూపతి రూపొందించిన కొత్త సినిమా మంగళవారం. హారర్ మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
మహాలక్ష్మిపురంలో ఆ ఊరి దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున రెండు జంటలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ఆత్మహత్యలు అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగినవని గోడలపై రాతలు కనిపిస్తాయి. ఇవి ఆత్మహత్యలు కావని, హత్యలని నమ్ముతుంది పోలీస్ ఆఫీసర్ మాయ (నందిత శ్వేత). ఇవి హత్యలని నిరూపించేందుకు ఆమె చేసే ప్రయత్నాలను అడ్డుకుంటారు ఊరి జనం. చనిపోయిన వారికి పోస్ట్ మార్టం చేయకుండా ఎస్ ఐ మాయను అడ్డుకుంటారు. ఇవి హత్యలా, ఆత్మహత్యలా వాటిని పోలీస్ ఆఫీసర్ మాయ ఎలా ఛేదించింది. ఈ ఊరి గోడలపై రాతలు రాస్తున్న వ్యక్తి ఎవరు. ఈ కథకు ఊరి నుంచి వెలివేయబడిన శైలజ (పాయల్ రాజ్ పుత్)కు సంబంధం ఏంటి అనేది తెరపై చూడాలి.
ఎలా ఉందంటే..
మిస్టిక్ అంశాలున్న సినిమాలు ఈ మధ్య ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఆ క్రమంలో మిస్టిక్, థ్రిల్లర్, హారర్ అంశాలు కలిపి రూపొందించిన సినిమా మంగళవారం. ఈ మూడు అంశాలను కలిపి సినిమా చేసే క్రమంలో ఏ అంశానికీ బలమైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయాడు దర్శకుడు అజయ్ భూపతి. ద్వితీయార్థం దాకా అసలైన కథలోకి వెళ్లకుండానే కథను ముందుకు నడిపించాడు. శైలజ చిన్నతనం, రవి అనే యువకుడితో ఆమె ప్రేమాయణం నేపథ్యంలో కథ ప్రారంభవుతుంది. ఊరిలో దేవతకు ఇష్టమైన మంగళవారం రోజున ఆత్మహత్యలు జరగడంతో ఊరి జనం భయపడుతుంటారు. గోడలపై రాతలు ఎవరు రాస్తున్నారు, ఆ తర్వాతి రోజే ఆత్మహత్యలు జరగడం కథమీద ఆసక్తిని రేపుతుంది. అయితే హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఎంచుకున్న నేపథ్యం అందరికీ నచ్చదు. కథలోని డ్రామా ఎక్కువవడం కూడా సినిమాలోని సహజత్వాన్ని పోయేలా చేసింది. సెకండాఫ్ లో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా సినిమాను సైడ్ ట్రాక్ పట్టిస్తాయి. ఇక్కడి నుంచి స్క్రీన్ ప్లే నెమ్మదిస్తుంది. సినిమా క్లైమాక్స్ కూడా ఫర్వాలేదనిపించేలా ఉంది. మంగళవారం సినిమా ఆడియెన్స్ ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలి. శైలజ క్యారెక్టర్ లో పాయల్ రాజ్ పుత్ అటు బోల్డ్ గా, ఇటు పర్ ఫార్మెన్స్ పరంగా బాగా చేసింది. టెక్నికల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది.