నటీనటులు: సుధీర్ బాబు, మృణాళినీ రవి, ఈషా రెబ్బా, హర్షవర్ధన్, అజయ్ తదితరులు
టెక్నికల్ టీమ్ – సంగీతం: చైతన్ భరద్వాజ్, డీవోపీ: పీజీ విందా, నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, రచన, దర్శకత్వం: హర్షవర్ధన్
సుధీర్ బాబు మూడు క్యారెక్టర్స్ లో నటించిన మామా మశ్చీంద్ర సినిమా ఇవాళ థియేటర్స్ లో రిలీజైంది. ట్రైలర్ తో సినిమా మీద చాలా క్లారిటీ రావడంతో మామా మశ్చీంద్రలో కొత్తదనం ఏముంటుందా అనే సందేహాలు కలిగాయి. మరి మిగిలిన కథను థియేటర్ లో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
తన తల్లిని చంపిన తండ్రి, మేనమామపై పగ పెంచుకుంటాడు పరశురామ్ (సుధీర్ బాబు). తండ్రిని చంపి జైలుకు వెళ్లొస్తాడు. మేమమాన కూతురిలా పెంచుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. బిడ్డకు జన్మనిచ్చాక పరశురామ్ భార్య చనిపోతుంది. మామ కూడా మరణిస్తాడు. అయితే కుటుంబ సభ్యుల నుంచే తనకు, తన కూతురికి ప్రాణహాని ఉందని భయపడుతుంటాడు పరశురామ్. ఆస్తినంతా అమ్మేసుకుని విదేశాలకు వెళ్దమనుకునే టైమ్ లో పరశురామ్ పై హత్యాయత్నం జరుగుతుంది.ఈ హత్యా ప్రయత్నం చేసిందెవరు. ఆ హంతకులతో దుర్గా (సుధీర్ బాబు), డీజే (సుధీర్ బాబు)కు ఏమైనా సంబంధం ఉందా వైరల్ విశాలాక్షి (ఈషా రెబ్బ), మీనాక్షి (మృణాళిని రవి)లో పరశురామ్ కూతురు ఎవరు అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
హీరో ద్విపాత్రిభినయం చేస్తేనే సినిమాలో కావాల్సినంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. అలాంటి మూడు క్యారెక్టర్స్ తో సినిమా చేసి మెప్పించడం అంత ఈజీ కాదు. ఈ విషయం మామా మశ్చీంద్రతో అటు దర్శకుడు హర్ష, ఇటు హీరో సుధీర్ బాబుకు అర్థమై ఉంటుంది. తనను, తన కుటుంబాన్ని ఎవరో చంపేస్తారని కూతురిని సైతం మార్చేస్తుంటాడు పరశురామ్. అలాగే అనుమానం వచ్చిన వారి ఇళ్ల మీద బాంబులు వేస్తుంటాడు. ఇదంతా అనుమానంతోనే. ఇలా సినిమా ఆరంభం నుంచి కథ, పాత్రలను ఎక్కడా ప్రేక్షకులు రిలేట్ చేసుకోలేకపోతారు. అర్థం లేని డ్రామా, ఎమోషన్, కామెడీతో మామా మశ్చీంద్ర కథను వీలైనన్ని రకాలుగా కిచిడీ చేసి పారేశాడు దర్శకుడు హర్ష వర్థన్. ఎక్కడా ఎమోషన్ కానీ, కామెడీ కానీ, లవ్ ఫీల్ కానీ ఏర్పడదు.
సెకండాఫ్ లో కథలో కొన్ని మలుపులు ఆకట్టుకున్నా..క్లైమాక్స్ పై చాలా ముందే ప్రేక్షకుల ఒక కన్ క్లూజన్ కు వచ్చేస్తారు. శత్రువులు ఎవరో తెలిశాక కూడా పరశురామ్ కూతురు ఎవరు, సుధీర్ ప్రేమించింది ఎవర్ని అనే డ్రామాను మరో ముప్పావుగంట నడిపి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు దర్శకుడు. కాసేపైనా సినిమా బాగుందని అనిపించదు. పరశురామ్ పాత్ర ఈ సినిమాకు కీలకం. అయితే అతన్ని విలన్ గా చూపించడం ద్వారా ఆ పాత్ర మీద ఏర్పడాల్సిన సింపథీ లేకుండా పోతుంది. సుధీర్ బాబు మూడు పాత్రల్లో తన శక్తి మేరకు నటించాడు. పరశురామ్ పాత్రలో అతని పర్ ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్స్ లో ఈషా రెబ్బా, మృణాళినీకి చేసేందుకు పెద్దగా ఏం లేదు. టెక్నికల్ గా సినిమా ఫర్వాలేదు.