నటీనటులు – నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్ తదితరులు
టెక్నికల్ టీమ్ – సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎడిటర్: నవీన్ నూలి, డీఓపీ: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి, ఆర్ట్: రామ్ అరసవిల్లి, నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య, సమర్పణ: ఎస్. నాగ వంశీ, రచన దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
టీజర్, ట్రైలర్ పాటలతో యూత్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్న మ్యాడ్ మూవీ ఈ వారం థియేటర్స్ లోకి వచ్చింది. టాలీవుడ్ లో యూత్ ఫుల్ సినిమాలకు మంచి సక్సెస్ హిస్టరీ ఉంది. మ్యాడ్ అలాంటి సక్సెస్ అందుకుందా లేదా రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఆఐఈ)లో ముగ్గురు విద్యార్థులు మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్). వీరిలో మనోజ్, అశోక్ కు కాలేజ్ లో లవ్ సెట్ అవుతుంది. కానీ దామోదర్ కు మాత్రం ఒకమ్మాయి అజ్ఞాతంగా ఉత్తరాలు రాస్తూ ప్రేమిస్తానని చెబుతుంటుంది. ఫోన్ లో మాట్లాడుతూ ఆ అమ్మాయికి దగ్గరవుతాడు దామోదర్. మరి వీరి ప్రేమ కథ చివరకు ఏమైంది. ఆ ఫోన్ చేసే అమ్మాయి ఎవరు. లడ్డూ స్టోరీ ఏంటి అనేది అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
కాలేజ్ నేపథ్యంగా వచ్చే సినిమాలన్నీ యూత్ కు ఒక సందేశాన్నిస్తూ మంచి కథతో తెరకెక్కుతాయి. త్రీ ఇడియడ్స్, హ్యాపీ డేస్ వంటి సినిమాలు ఇలా యూత్ ను ఇన్స్ పైర్ చేశాయి. కానీ మ్యాడ్ సినిమా మాత్రం పేరుకు తగినట్లే ఒక పర్పస్ లేకుండా పిచ్చిగా తెరకెక్కించారు. ఇందులో కాలేజ్ లో కనిపించే ర్యాగింగ్, చదువులు, వాటి తో వచ్చే ర్యాంకుల పోటీ ఇలాంటివి లేకుండా కేవలం కొన్ని పాత్రల మధ్య కథను నడిపాడు దర్శకుడు కల్యాణ్ శంకర్. ఈ పాత్రల మనస్తత్వాలు, అవి ప్రవర్తించే తీరు, వాటి ద్వారా పుట్టే కామెడీపైనే ఆధారపడ్డాడు. బలమైన కథంటూ ఏమీ లేదు. కేవలం పంచ్ డైలాగ్స్, కుళ్లు జోక్స్ తో ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ జాతిరత్నాలు సినిమా ఫ్లేవర్ గుర్తుకుతెస్తాయి. సినిమాలో చాలా చోట్ల ఈ కామెడీ మనం చూసిందే కదా అనే ఫీల్ కలుగుతుంటుంది.
రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్ తో పాటు హీరోయిన్స్ కూడా తమ క్యారెక్టర్స్ లో సహజంగా, ఎనర్జిటిక్ గా నటించారు. వీళ్లంతా సినిమాకు ఫ్రెష్ నెస్ తీసుకొచ్చారని చెప్పాలి. అనుదీప్ కాసేపు కామెడీ చేశాడు. ఇక దర్శకుడు తెరపై చేసిన ఈ హంగామాకు కొంత మీనింగ్ ఫుల్ స్టోరి యాడ్ చేసి ఉంటే సినిమా మంచి రిజల్ట్ ఇచ్చేది. పాటలు ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ బాగుంది.