నటీనటులు – విజయ్, త్రిష కృష్ణన్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా తదితరులు
టెక్నికల్ టీమ్: సంగీతం: అనిరుధ్ రవిచందర్, డీవోపీ: మనోజ్ పరమహంస, యాక్షన్: అన్బరివ్, ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్, నిర్మాత: ఎస్ ఎస్ లలిత్ కుమార్,
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
కథేంటంటే
భార్య సత్య (త్రిష)..ఇద్దరు పిల్లలతో హిమాచల్ ప్రదేశ్ లో ఓ కేఫ్ నడుపుకుంటూ హ్యాపీగా ఉంటాడు పార్తిబన్ (విజయ్). ఒక రోజు అతని కేఫ్ లో కొందరు దొంగలు పడి డబ్బు దోచుకెళ్లాలని ప్రయత్నిస్తారు. వారిని కాల్చి చంపేస్తాడు పార్తిబన్. పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. ఆత్మ రక్షణ కోసం దొంగలను కాల్చిచంపానని కోర్టులో పార్తిబన్ చెప్పగా…అతన్ని నిర్దోషిగా విడుదల చేస్తుంది కోర్టు. అయితే ఈ వార్త చదివిన ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) తన కొడుకు లియో (విజయ్) లా ఉన్న పార్తీబన్ పట్టుకుని చంపేందుకు హిమాచల్ ప్రదేశ్ వస్తాడు. ఆంటోనీ దాస్ నుంచి పార్తీబన్ తనను, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు, లియో ఎవరు, పార్తీబన్ లియో ఒకటేనా, కొడుకు లియోను చంపేందుకు ఆంటోనీదాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు. అన్న హెరాల్డ్ దాస్ (అర్జున్ సర్జా) కూడా తమ్ముడు లియోను ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
విజయ్, దర్శకుడు లోకేష్ గతంలో చేసిన మాస్టర్ సినిమా హిట్ కావడం, కమల్ తో లోకేష్ చేసిన విక్రమ్ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఈ కాంబోలో వచ్చిన లియోపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. లియో కథలోకి వస్తే….కలెక్టర్ ను చంపిన ముఠా పారిపోతుండటంతో సినిమాను అగ్రిసెవ్ గా స్టార్ట్ చేశాడు దర్శకుడు. అటు పార్తీబన్ ఓ హైనాతో పోరాడే సీన్ తో అతని ఇంట్రో కూడా పవర్ ఫుల్ గా మొదలవుతుంది. ఆ తర్వాత కేఫ్ నడుపుకుంటూ పార్తీబన్ ఫ్యామిలీతో సాగే సీన్స్ తో కథనం డల్ అవుతుంది. మళ్లీ అతని కేఫ్ లో దొంగలు పడి, వాళ్లను పార్తీ చంపడంతో కథలో ట్విస్ట్స్ మొదలవుతాయి. పార్తీబన్ కోసం ఆంటోనీ గ్యాంగ్ వేట, వారి నుంచి కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం హీరో చేసే సాహసాలు, యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటాయి.
ఆంటోనీ దాస్ గా సంజయ్ దత్ తో కొన్ని అనవసరపు సీన్స్ చేయించారు. హెరాల్డ్ దాస్ తో లియో తలపడే సీన్స్ కూడా చాలా ల్యాగ్ తో ఉంటాయి. ఈ ఫైట్స్ కు పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. చివరలో విక్రమ్ (కమల్ హాసన్) పార్తీకి కాల్ చేసి మాట్లాడటం..విక్రమ్ సినిమాలో సూర్య ఇంట్రోలా పేలలేదు. ఖైదీ సినిమాలోని నెపోలియన్ క్యారెక్టర్ ను ఇందులోనూ కొనసాగించారు. కండబలంతో పాటు బుద్ధి బలంతో పార్తీబన్ విలన్స్ తో పోరాడే సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో విజయ్ నటన బాగుంది. లియోగా, పార్తీబన్ గా మెప్పించాడు విజయ్. సత్యగా త్రిష నటన ఆకట్టుకుంటుంది. సంజయ్ దత్, అర్జున్ తమ క్యారెక్టర్స్ మేరకు నటించారు. అనిరుధ్ నేపథ్య సంగీతం, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ లియోకు ఆకర్షణగా నిలుస్తాయి.