రివ్యూ – కింగ్ ఆఫ్ కోతా
నటీనటులు – దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, షబీర్, ప్రసన్న తదితరులు
టెక్నికల్ టీమ్ – సినిమాటోగ్రఫీ – నిమిష్ రవి, మ్యూజిక్ – జేక్స్ బిజోయ్, నిర్మాణం – జీ స్టూడియోస్, వేఫెరర్ ఫిలింస్, దర్శకత్వం – అభిలాష్ జోషి.
దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందుతున్న రోజులువి. ఈ నేపథ్యంలో ప్రతి స్టార్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు వస్తున్నాయి. ఇలా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోతా సినిమా. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
బ్రిటీషర్లు నిరంకుశంగా పాలించిన ఏరియా కోతా. ఇక్కడ కారణాలు లేకుండా ప్రజలను శిక్షించేవారు. అలాంటి క్రూరమైన ప్రాంతం ఆ తర్వాత రాజు (దుల్కర్ సల్మాన్) చేతిలోకి వస్తుంది. అక్కడ అతనిదే రాజ్యం. అతను చెప్పిందే వేదం. రాజుకు అతని స్నేహితుడు కన్నా(షబీర్) అంటే ప్రాణం. అతనికి ప్రతి సందర్భంలో సాయం చేస్తుంటాడు రాజు. రాజు తార (ఐశ్వర్య లక్షి)ను ప్రేమిస్తాడు. తార ప్రేమలో మోసపోయిన రాజు మద్యానికి బానిసవుతాడు. ఇంతలో ప్రత్యర్థులతో రాజు స్నేహితుడు కన్నా చేతులు కలుపుతాడు. తన జీవితంలో బాగా ఇష్టపడిన ప్రేయసి, స్నేహితుడు..తనను మోసం చేయడంతో రాజు కోతా ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతాడు. ప్రత్యర్థులతో కోతాలో కన్నా అరాచకాలకు పాల్పడుతాడు. ఈ పరిస్థితుల్లో రాజు తిరిగి కోతాకు వచ్చాడా? లేదా? కన్నా అరాచకాలను రాజు ఎలా అడ్డుకున్నాడు? అనేవి తెరపై చూడాలి.
ఎలా ఉందంటే..
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అభిలాష్ జోషి. కోతా అనే ఊరిలో కథంతా జరుగుతుంటుంది. కోతాలో కన్నా అనే గ్యాంగ్ స్టర్ చేసే అరాచకాలు చూపిస్తూ కథ మొదలవుతుంది. అతని అరాచకాలను అడ్డుకోవాలని చూసి భంగపడిన ఓ పోలీస్ అధికారి ..అందుకు రాజు అనే వ్యక్తి సహాయం తీసుకోవాలనుకుంటాడు. ఈ రాజు ఎవరు, అతనికి కన్నాకు ఏంటి సంబంధం అనే రివీలేషన్ తో కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ వరకు చాలా భాగం కథను, పాత్రలను డీటెయిల్డ్ గా చూపించేందుకు దర్శకుడు సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కో మలుపుతో ఆకట్టుకుంటుంది.
రాజు పాత్రలో దుల్కర్ నటన బాగుంది. యాక్షన్, ఎమోషన్, లవ్, ఫ్రెండ్షిప్ ఇలా అనేక అంశాల్లో దుల్కర్ ఆకట్టుకునేలా నటించాడు. ఐశ్వర్య లక్ష్మి, షబీర్ తమ పాత్రల మేరకు మెప్పించారు. కింగ్ ఆఫ్ కోతాలో అనేక ఎలివేషన్ సీన్స్, హీరోయిజం చూపించే యాక్షన్ సీన్స్ ఉన్నాయి. వీటికి జేక్స్ బిజోయ్ అందించిన బీజీఎం బలాన్నిచ్చింది. అయితే సినిమాను ఎక్కువ నిడివితో చూపించడం, రొటీన్ రివేంజ్ ఫార్ములాతో సినిమా సాగడం ప్రేక్షకుల్ని విసిగిస్తుంది. లవ్, ఫ్రెండ్షిప్ వంటి బలమైన ఎమోషన్స్ ఉన్నా…వాటిని ఆకట్టుకునేలా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చూపించలేకపోయాడు దర్శకుడు. దాంతో ఒక రొటీన్ రివేంజ్ డ్రామాగా కింగ్ ఆఫ్ కోతా మిగిలిపోతుంది. కథ కంటే యాక్షన్, హీరోయిజం మీదే దర్శకుడు దృష్టి పెట్టాడం పెద్ద మైనస్ పాయింట్. నిడివి తగ్గిస్తే ఇంకాస్త బెటర్ రిజల్ట్ ఉండేదని అనిపిస్తుంటుంది. కెమెరా, సెట్ వర్క్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.