నటీనటులు – సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు
టెక్నికల్ టీమ్- ఎడిటర్ – నిశాద్ యూసుఫ్, సినిమాటోగ్రఫీ – వెట్రి పళనిస్వామి, కథ – శివ, ఆది నారాయణ, ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్, దర్శకత్వం – శివ
సౌత్ స్టార్స్ భారీ పాన్ ఇండియా చిత్రాలతో తెరపై కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ సూర్య కూడా ఇలాగే ‘కంగువ’తో ఒక హ్యూజ్ పీరియాడిక్ యాక్షన్ మూవీ చేశారు. ఈ సినిమా ఈ రోజు థియేటర్స్ లోకి గ్రాండ్ గా వచ్చేసింది. ప్రమోషనల్ కంటెంట్ తో హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ‘కంగువ’ థియేటర్స్ లో ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
గోవాలో నేరస్తులను పట్టుకుంటూ పోలీస్ కమీషనర్ కు సహకరిస్తుంటారు ఫ్రాన్సిస్ (సూర్య), ఏంజెలీనా( దిశా పటానీ). అలా నేరస్తులను పట్టుకున్నందుకు నగదు బహుమతి పొందుతుంటారు వీళ్లిద్దరు. గతంలో ప్రేమికులే అయినా తర్వాత విడిపోయి ఈ క్రిమినల్స్ ను పట్టుకోవడంలో గొడవలు పడుతుంటారు. ఈ క్రమంలో సూర్యకు ఓ అబ్బాయి దొరుకుతాడు. ఈ అబ్బాయి అనారోగ్యంతో ఉండటంతో సూర్య ఆస్పత్రిలో చూపిస్తాడు. ఈ అబ్బాయి మెదడను ఎవరో ఆపరేట్ చేస్తున్నారంటూ అక్కడి వైద్యులు చెప్పడంతో ఫ్రాన్సిస్ ఆశ్చర్యపోతాడు. ఆ కుర్రాడితో తనకు ఏదో అనుబంధం ఉన్నట్లు ఫ్రాన్సిస్ భావిస్తుంటాడు. ఇక్కడ కట్ చేస్తే కథ 1070 సంవత్సరంలో ఓపెన్ అవుతుంది. అక్కడ అరణ్య కోన, కపాల కోన, సాగర కోన, హిమ కోన, ప్రణవాది కోన..ఇలా ఇరుగు పొరుగునే ఉన్న ఐదు ప్రాంతాల్లో ఐదు తెగల వారు జీవిస్తుంటారు. విదేశీ రాజులు ఈ కోనలను ఆక్రమించుకుని, అక్కడ తమ సైన్యానికి కావాల్సిన శిక్షణ, నివాసం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తారు. ప్రణావాది కోనకు చెందిన యువరాజు కంగువ (సూర్య) ఈ ఆక్రమణను ఎలా అడ్డుకున్నాడు. కపాల కోన రాజు ఉధిరన్ (బాబీ డియోల్) ను ఎలా ఎదిరించాడు. ఉలూకుడు (ఫస్టాఫ్ లో కనిపించే బాలుడు)తో కంగువకు ఉన్న రిలేషన్ ఏంటి అనేది తెరపై చూడాలి.
ఎలా ఉందంటే
ఇప్పటి వర్తమాన కాలాన్ని, వెయ్యేళ్ల కిందట కథను కలిపి ఆసక్తికరంగా అల్లుకున్న కథ కంగువ. ఈ కథను సాధ్యమైనంత రా అండ్ రస్టిక్ గా, భారీ నిర్మాణ విలువలతో రూపొందించారు దర్శకుడు శివ అండ్ టీమ్. కమర్షియల్ సినిమాలు ఇష్టపడే ఈ దర్శకుడు కంగువలో వీలు కుదిరినప్పుడు మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ చేర్చాడు. దీంతో సినిమా రా అండ్ రస్టిక్ గా ఉండటంతో పాటు కలర్ ఫుల్ గా కూడా కనిపిస్తుంటుంది. ప్రథమార్థాన్ని సాంగ్స్, ఫైట్, ఎంటర్ టైన్ మెంట్ కోసం దర్శకుడు ఉపయోగించుకున్నాడు. కోల్ట్ (యోగి బాబు), యాక్సలేటర్ (రెడిన్ కింగ్స్ లే) క్యారెక్టర్స్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తే, దిశా పటానీ గ్లామర్, సాంగ్స్ లో డ్యాన్స్ లతో అలరించింది. ఫ్రాన్సిస్ కు బాబు దొరకడం, అతని మెదడు అసాధారణంగా ఉండటం, అతన్ని చూసినప్పుడు ఫ్రాన్సిస్ లో కలిగే భావాలు కథలో ఆసక్తిరేపుతుంటాయి. అక్కడి నుంచి మొదలైన ఈ క్యూరియాసిటీ కంగువ ప్రపంచాన్ని పరిచయం చేయడంతో మరింత రక్తికడుతుంది.
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆ ప్రపంచంలో ఐదు తెగల్లో ప్రణవాది కోనకు చెందిన వీరుడు కంగువ. తన వారి కోసం ఎంతటి సాహసమైనా చేస్తాడు. తన తెగ వారిని కాపాడుకునేందుకు కంగువ చేసే వీరోచిత పోరాటాలు ఆకట్టుకుంటాయి. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సాగే ఈ యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు ఆకర్షణగా మారాయి. సూర్య కంగువగా మారిపోయిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. అప్పుడే ఫ్రాన్సిస్ అనే అల్ట్రా స్టైలిష్ సూర్యను చూసిన కళ్లతో మరోవైపు కంగువ క్యారెక్టర్ ను చూస్తుంటే ఇంత వర్సటైల్ గా నటించడం సూర్యకే సాధ్యమనే ఫీల్ కలుగుతుంది. ఈ పాత్ర కోసం సూర్య ఎంత కష్టపడ్డాడో స్క్రీన్ మీద చూడొచ్చు. దిశా పటానీ తన గ్లామర్ తో సినిమాకు ఒక కలర్ ఫుల్ నెస్ తీసుకొచ్చింది. బాబీ డియోల్ సాధ్యమైనంత క్రూరంగా కనిపించాడు. అతని ఉధిరన్ క్యారెక్టర్ కంగువకు ఒక పిల్లర్ గా నిలుస్తుంది. చివరలో వచ్చిన గెస్ట్ రోల్ కంగువకు మరో హైలైట్.
టెక్నికల్ గా చూస్తే దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం మూవీ ఫీల్ ను రెట్టింపు చేశాయి. బీజీఎంలో దేవి ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు. సీన్స్ ను మరింత ఇంపాక్ట్ ఫుల్ గా మార్చాడు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్, సీజీ వర్క్ ఎక్ట్రార్డినరీగా ఉన్నాయి. కంగువ మరో బిగ్గెస్ట్ అటెంప్ట్ గా హీరో సూర్య కెరీర్ తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలిచిపోతుంది.
రేటింగ్ 3.5/5