రివ్యూ – కల్కి 2898ఎడి

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ కల్కి రిలీజ్ కోసం సినీ ప్రియుల ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. నిన్న సాయంత్రం నుంచి ఏ,బీ, సీ, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా థియేటర్స్ దగ్గర అభిమానులు, ప్రేక్షకులు సందడి చేస్తున్నారు. ట్రైలర్స్ చూస్తే హాలీవుడ్ స్థాయి మేకింగ్ తో ఆకట్టుకుంది కల్కి. దేశంలోని దిగ్గజ నటులు, యంగ్ స్టార్స్ గెస్ట్ అప్పీయరెన్స్ లు వంటి హైలైట్స్ ఉన్న కల్కి థియేటర్స్ లో ప్రేక్షకుల్ని ఎంతగా మెస్మరైజ్ చేసింది అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటంటే
కురుక్షేత్రం యుద్ధం తర్వాత శ్రీకృష్ణావతారం ముగుస్తుంది. ఆ తర్వాత 6 వేల ఏళ్లకు కల్కి కథ మొదలవుతుంది. ప్రపంచపు మొదటినగరం వెలుగు వెలిగిన కాశీ చివరి నగరంగా మారుతుంది. సుప్రీం యాస్కిన్ (కమల్ హాసన్) భూమ్మీద వనరులన్నీ పీల్చుకుని సర్వహంగులతో కాంప్లెక్స్ నగరాన్ని నిర్మిస్తాడు. కాశీ ప్రజల్ని ఇబ్బందుల్లో పడేస్తాడు. బౌంటీ ఫైటర్ భైరవ (ప్రభాస్)కు కాంప్లెక్స్ వెళ్లి ఉండాలనుకుంటాడు. ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ యాస్కిన్ ప్రాజెక్ట్ కే అనే కార్యక్రమం మొదలపెడతాడు. అందుకు కాశీలోని అమ్మాయిల్ని కాంప్లెక్స్ కు తీసుకెళ్లి గర్భవతుల్ని చేస్తారు. వారి నుంచి సీరం సేకరిస్తారు. సుమతి (దీపిక పడుకోన్)ని కూడా కాంప్లెక్స్ లోకి తీసుకెళ్తారు. ప్రాజెక్ట్ కే అనేది ఏంటి. దాని ద్వారా సుప్రీం యాస్కిన్ ఏం చేయాలనుకున్నాడు. సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) ఎలాంటి పోరాటం చేశాడు. అసలు భైరవ ఎ‌వరు, అతనికి అశ్వత్థామకు ఉన్న సంబంధం ఏంటి అనేది తెరపై చూడాల్సిన సినిమా.

ఎలా ఉందంటే

కల్కి సినిమాను మన పురాణాల్లో చెప్పిన అన్ని విషయాలకు క్లైమాక్స్ లా డిజైన్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ధర్మ సంస్థాపన కోసం కల్కిగా మళ్లీ పుడతానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు కలియుగంలో అతని పాత్ర ఎలా ఉంది అనేది చూపించాడు. స్టార్ వార్స్ లాంటి హాలీవుడ్ మూవీస్ మేకింగ్ కు మన పురాణాల నేపథ్యం కలిస్తే ఎలా ఉంటుందో కల్కిని అలా తీర్చిదిద్దాడు నాగ్ అశ్విన్. అత్యున్నత స్థాయి మేకింగ్, భారీ సెట్స్, స్టార్ కాస్టింగ్ తో కల్కి సినిమా వండర్ ఫుల్ సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ అందిస్తుంది. మహాభారతంతో మనకు బలమైన కనెక్షన్ ఉంది. దాన్ని కల్కి కథకు ఉపయోగించిన తీరు గొప్ప ప్రయత్నం అని చెప్పాలి. మహాభారతం యుద్దంతో కల్కి కథ మొదలవుతుంది. అక్కడి నుంచి ప్రపంచపు చివరి నగరంగా దీన స్థితిలో మిగిలిన కాశీని, అక్కడి ప్రజల ఇబ్బందులను చూపిస్తారు. తాగేందుకు నీరు, పీల్చేందుకు గాలి కూడా లేని పరిస్థితుల్లో కాశీ ప్రజలు ఎలా జీవిస్తున్నారు అనేది ప్రేక్షకుల్ని ఎమోషన్ కు గురిచేస్తుంది. కథలోకి అడుగుపెట్టే క్రమంలో దర్శకుడు కొంత నెమ్మదిగా స్క్రీన్ ప్లే చేశాడు. భైరవ, అశ్వత్థామకు మధ్య సంఘర్షణ మొదలైనప్పటి నుంచి కల్కి కథనంలో వేగం పెరుగుతుంది. కాశీ, షంబాల, కాంప్లెక్స్ అనే మూడు ప్రపంచాల మధ్య కథ సాగుతుంది. క్లైమాక్స్ లో ప్రభాస్ గురించి రివీల్ అయ్యే ఓ ట్విస్ట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సీక్వెల్ కు కూడా చివరలో లీడ్ ఇచ్చారు

చిన్న కామిక్ టైమింగ్, గ్రే షేడ్, హీరోయిజం అన్నీ ఉన్న భైరవ లాంటి పాత్ర ప్రభాస్ చేయడం ఇదే తొలిసారి. ఫైట్స్ సహా అన్ని ఎమోషన్స్ లో ప్రభాస్ ది బెస్ట్ అనిపించుకున్నాడు. సుమతిగా దీపిక పర్పెక్ట్ కాస్టింగ్. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ విశ్వరూపం చూపించారు. యాస్కిన్ గా కమల్ హాసన్ పాత్ర నిడివి కొంతే అయినా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంది. దిశా పటానీ ఒక ఫైట్ లో హైలైట్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ గెస్ట్ అప్పీయరెన్సెస్ విజిల్స్ వేయిస్తాయి.

టెక్నికల్ గా చూస్తే సంతోష్ నారాయణ్ పాటలతో పాటు బీజీఎం హై క్వాలిటీలో ఇచ్చాడు. జోర్డే సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్టులు, వైజయంతీ మూవీస్ టాప్ క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాను భారతీయ ఫిలిం ఇండస్ట్రీ గర్వించే స్థాయిలో ఉన్నాయి. నెక్ట్ జెనరేషన్ సినిమాలకు కల్కి ఒక ఇన్సిపిరేషన్ గా నిలుస్తుంది.

రేటింగ్ 3.5/5