నటీనటులు – ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మణి చందన, మధుమణి, తదితరులు.
టెక్నికల్ టీమ్: సంగీతం – జీవన్ బాబు, ఎడిటర్ – విజయ్ కట్స్, సినిమాటోగ్రఫీ – నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి, సమర్పణ – కె. రాఘవేంద్ర రెడ్డి, నిర్మాత – లీలా గౌతమ్ వర్మ, రచన, దర్శకత్వం – శివ శేషు
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో డిఫరెంట్ మూవీగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది కలి సినిమా. ప్రిన్స్, నరేష్ అగస్త్య హీరోలుగా నటించిన ఈ మూవీ ఆత్మహత్యలు వద్దనే మంచి సందేశంతో పాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రూపొందింది. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగా మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
అడిగిన వారికి సాయం చేసే మంచి మనసుకున్న యువకుడు శివరామ్ (ప్రిన్స్). డబ్బున్న కుటుంబం నుంచి వచ్చినా అతను కాలేజ్ లో లెక్టరర్ గా పనిచేస్తుంటాడు. శివరామ్ మంచి మనసు చూసి అతన్ని ఇష్టపడుతుంది వేద(నేహా కృష్ణన్). కుటుంబ సభ్యులు ఒప్పుకోకున్నా వారిని ఎదిరించి శివరామ్ తో ఏడడుగులు వేస్తుంది. శివరామ్ మంచితనం అలుసుగా తీసుకుని అతని ఫ్యామిలీ వాళ్లే ఆస్తి కాజేసేందుకు ప్రయత్నిస్తారు. ఉన్న ఇంటిని కూడా లేకుండా చేస్తారు. నువ్వు మంచివాడివే కానీ కుటుంబాన్ని చూసుకోవడం చేతకాదంటూ అతన్ని వదిలి పాపను తీసుకుని వెళ్లిపోతుంది. ఆస్తి కంటే ప్రేమించిన భార్య, పాప తనను వదిలి వెళ్లడంతో మనస్తాపానికి గురవుతాడు శివరామ్. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఇంతలో శివరామ్ ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి(నరేష్ అగస్త్య) వస్తాడు. ఆ వ్యక్తి వచ్చాక శివరామ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది. ఈ అపరిచిత వ్యక్తి ఎవరు, ఈ కథలో కలి పురుషుడు ఏం చేశాడు, శివరామ్ జీవితం చివరికి ఏమైంది అనేది మిగిలిన స్టోరీ.
ఎలా ఉందంటే
ఇది మన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే సినిమాలెన్నో ఈ మధ్య వస్తున్నాయి. కలి అలాంటి ప్రయత్నమనే చెప్పాలి. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని చెప్పే కథతో దర్శకుడు శివశేషు ఈ సినిమాను రూపొందించిన విధానం అభినందనీయం. ఆత్మహత్యతో సమస్యలు పరిష్కారం కావని, అక్కడి నుంచే అసలైన సమస్యలు మొదలవుతాయని చెప్పిన కోణం బాగుంది. ఆత్మహత్య తర్వాత వారి కుటుంబం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో చాలా ప్రాక్టికల్ గా చూపించారు. ఇది చూశాక ఎవరైనా సూసైడల్ టెండెన్సీ ఉన్నవారు ఖచ్చితంగా ఆలోచనలో పడతారు.
శివరామ్ పాత్రను ముగ్గురిగా చూపించి ప్రేక్షకుల్ని ఆసక్తిని కలిగించారు దర్శకుడు. ఆత్మహత్యల అంశం కాబట్టి సీరియస్ గా సాగే మూవీ కాదిది. లవ్ ఎలిమెంట్స్, ఒక రొమాంటిక్ సాంగ్ తో పాటు థ్రిల్లింగ్ అంశాలతో కూడిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. నరేష్ అగస్త్య శివరామ్ ఇంటికి వచ్చినప్పటి నుంచి మరింత ఆసక్తికరంగా సాగుతుంది సినిమా. ఎక్కడా ల్యాగ్ లేకుండా టు ది పాయింట్ మూవీని రూపొందించడం విశేషం. శివరామ్ పాత్ర చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో అతని మీద సింపథీ కలుగుతుంది. ప్రేక్షకులు ప్రధాన పాత్రకు కనెక్ట్ అయ్యారంటే అందులో మూవీ టీమ్ సక్సెస్ అయినట్లే. మ్యూజిక్ డైరెక్టర్ జె.బి. ఇచ్చిన బీజీఎం సీన్స్ ను మరింత ఎలివేట్ చేసింది. సినిమాకు ఏం కావాలో అది ప్రొడక్షన్ వ్యాల్యూస్ లో కనిపించింది.
కలి సినిమాకు ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ ప్రధాన బలంగా నిలుస్తుంది. శివరామ్ గా ప్రిన్స్, అపరిచిత వ్యక్తిగా నరేష్ అగస్త్య నటన ఆకట్టుకుంటుంది. నేహా కృష్ణన్ అందంతో పాటు తన అభినయంతో మెప్పిస్తుంది. ఈ మూడు ప్రధాన పాత్రలు అయితే మిగతా క్యారెక్టర్స్ లో నటీనటులు పాత్రోచితంగా కనిపించారు. టాలీవుడ్ నుంచి వచ్చిన ఒక మంచి సినిమాగా కలి నిలుస్తుంది.
రేటింగ్ – 3/5