రివ్యూ – “క”

నటీనటులు – కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే, బలగం జయరాం, తదితరులు

టెక్నికల్ టీమ్ – ఎడిటర్ – శ్రీ వరప్రసాద్, డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం, మ్యూజిక్ – సామ్ సీఎస్, ప్రొడ్యూసర్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి, రచన దర్శకత్వం – సుజీత్, సందీప్

ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది కిరణ్ అబ్బవరం క సినిమా. ఈ సినిమా కొత్తగా లేకుంటే నేను సినిమాలు చేయనని కిరణ్ అబ్బవరం చెప్పడం కూడా హైప్ క్రియేట్ చేసింది. పీరియాడిక్ సెటప్ లో సరికొత్త థ్రిల్లర్ మూవీగా ఈ రోజు విడుదలకు వచ్చింది క సినిమా. ప్రమోషన్ లో మూవీ టీమ్ చెప్పినంత స్ట్రాంగ్ కంటెంట్ ఈ మూవీలో ఉందా, ప్రేక్షకుల్ని క ఎంతవరకు మెప్పించింది అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఒక అనాథ. సొంత వాళ్లు లేని లోటు ఆయన జీవితంపై బాల్యం నుంచి ప్రభావం చూపిస్తుంది. తన వాళ్ల కోసం తపిస్తుంటాడు వాసుదేవ్. కుటుంబ బంధాలు ఎలా ఉంటాయో, ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఇతరుల ఉత్తరాలు చదువుతుంటాడు. ఇలా తన ఉత్తరం చదివాడని మాస్టారు వాసుదేవ్ ను కొడతాడు. ఆశ్రమం నుంచి పారిపోయిన వాసుదేవ్ కొన్నాళ్లకు కృష్ణగిరి అనే ఊరికి వచ్చి పోస్ట్ మ్యాన్ గా ఉద్యోగంలో చేరతాడు. పోస్ట్ మాస్టర్ రంగారావు (అచ్యుత్ కుమార్) కూతురు సత్యభామ (నయన్ సారిక) ను చూసి ప్రేమలో పడతాడు వాసుదేవ్. ఇలా సరదాగా సాగుతున్న కథలో కృష్ణగిరిలో అమ్మాయిలు మిస్ కావడం ఉత్కంఠను కలిగిస్తుంది. ఆ అమ్మాయిల కిడ్నాప్ లకు సంబంధించిన వివరాలు ఉన్న ఓ ఉత్తరం చదువుతాడు వాసుదేవ్. దాంతో వాసుదేవ్ లైఫ్ ప్రాబ్లమ్ లో పడుతుంది. వాసుదేవ్ తో పాటు స్కూల్ టీచర్ రాధ(తన్వీ రామ్) కూడా కిడ్నాప్ కు గురవుతారు. అందమైన కృష్ణగిరి ఊరిలో అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నది ఎవరు, వాసుదేవ్, రాధ కిడ్నాప్ నుంచి ఎలా బయటపడ్డారు. వాసుదేవ్, సత్యభామ ప్రేమ కథకు ముగింపు ఏంటి అనేది తెరపై చూడాలి.

ఎలా ఉందంటే

క సినిమా కొత్తగా ఉంటుందంటూ మూవీ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పింది. హీరో కిరణ్ అబ్బవరం కూడా వినయంగానే ఈ మాట చెప్పాడు. కొత్త కంటెంట్ చూస్తారంటూ క మూవీ టీమ్ చెప్పిన మాటలు నిజమేనని, ప్రేక్షకుల్ని థియేటర్స్ కు ఆకర్షించేందుకు చెప్పినవి కాదన్నది థియేటర్ లోని ప్రతి ప్రేక్షకుడూ ఫీలయ్యాడు. వాసుదేవ్ కు ఉన్న ఉత్తరాలు చదివే అలవాటుతో సరదాగా మొదలైన కథ, కృష్ణగిరికి అతను రావడం, సత్యభామతో ప్రేమలో పడటం వంటి సీన్స్ తో ప్లెజెంట్ గా సాగుతుంటుంది. ఊరిలో అమ్మాయిలు కిడ్నాప్ ల ఘట్టంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ఊరిలోని ఈ సమస్యను హీరో ఎలా పరిష్కరించాడు, ఆ క్రమంలో అతను ఎదుర్కొన్ని ఛాలెంజెస్ ఏంటి అనేది మూవీకి హైలైట్ గా నిలుస్తాయి. ఇంటర్వెల్ తో పాటు క్లైమాక్స్ సర్ ప్రైజ్ చేస్తాయి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో కృష్ణగిరి అనే ఊరు నేపథ్యంగా ఒక సరికొత్త థ్రిల్లర్ మూవీని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు దర్శకులు సుజీత్, సందీప్. కర్మ సిద్ధాంతాన్ని ఈ కథకు అప్లై చేసిన విధానం కూడా మెస్మరైజ్ చేస్తాయి. క టైటిల్ జస్టఫికేషన్ కూడా అద్భుతంగా ఉంది. అభినయ వాసుదేవ్ గా కిరణ్ అబ్బవరం ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ చేశారు. ఆయన కెరీర్ లో ఒక మెమొరబుల్ మూవీగా క నిలుస్తుంది. డ్యాన్సులు, యాక్షన్ సీక్వెన్సులు కిరణ్ బాగా చేయగలడని క ప్రూవ్ చేసింది. రాధగా తన్వీరామ్ రోల్ చాలా కీలకంగా సాగుతుంది. తన లుక్స్ , మేకోవర్ తో సత్యభామగా నయన్ సారిక ఆకట్టుకుంది. సినిమాకు పీరియాడిక్ ఆర్ట్ వర్క్ ఒక హైలైట్ గా చెప్పుకోవాలి. సామ్ సీఎస్ మ్యూజిక్ తో సన్నివేశాలకు లైఫ్ తీసుకొచ్చారు. క వంటి మూవీ చేసి నిర్మాతగా తన అభిరుచి చాటుకున్నారు నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి. క సినిమా ఆద్యంతం ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్తుంది. ఈ దీపావళికి థియేటర్స్ లో క వెలుగులు నింపబోతోంది.

రేటింగ్ 3.5/5