నటీనటులు: షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపకా పదుకోన్, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగి బాబు తదితరులు
సాంకేతిక బృందం: సంగీతం – అనిరుధ్, సినిమాటోగ్రఫీ – జీకే కృష్ణ, ఎడిటింగ్ – రూబెన్, బ్యానర్ – రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్, రచన దర్శకత్వం – అట్లీ.
ఈ ఏడాది మోస్ట్ అవేటెట్ మూవీగా జవాన్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. షారుఖ్ ఖాన్ పఠాన్ వంటి సూపర్ హిట్ తర్వాత నటించిన సినిమా కాబట్టి బాగా హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇవాళ రిలీజైన జవాన్ ఈ భారీ అంచనాలను నిలబెట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
ముంబై మెట్రో రైల్ ను కొంతమంది యువతులతో కలిసి హైజాక్ చేస్తాడో వ్యక్తి (షారుఖ్ ఖాన్). తనకు 40 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తే బంధీలను వదిలేస్తానని డిమాండ్ పెడతాడు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఐపీఎస్ అధికారి నర్మద (నయనతార)ను అపాంట్ చేస్తుంది ప్రభుత్వం. బంధీలకు ప్రమాదం కలగకూడదని హైజాకర్ అడిగినంత డబ్బు చెల్లిస్తారు అధికారులు. హైజాకర్ ఈ డబ్బులను పేద వారికి పంచడంతో అతను వార్తల్లో వ్యక్తి అవుతాడు. ప్రతి ఒక్కరూ అతని గురించే మాట్లాడుకుంటారు. నర్మద ఇన్వెస్టిగేషన్ లో జైలర్ ఆజాద్ పోలికలతో హైజాకర్ ఉన్నట్లు గుర్తిస్తుంది. ఆజాద్ హైజాకర్ లా మారాడా. గతంలో ఆర్మీలో పనిచేసిన విక్రమ్ రాథోడ్ (షారుఖ్ ఖాన్)కు ఆజాద్ కు సంబంధం ఏంటి. మరోవైపు ఆయుధ వ్యాపారి కాళీ గైక్వాడ్ ఈ కథలో ఏం చేశాడు అనేది తెరపై చూడాలి.
ఎలా ఉందంటే
దర్శకుడు అట్లీ హీరో విజయ్ తో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అందుకు కారణం ఆ సినిమాల్లోని మాస్ హీరోయిజం, కమర్షియల్ అంశాలు. హీరోకు అట్లీ ఇచ్చే ఎలివేషన్స్. ఇవన్నీ అతని సినిమాలను బీ, సీ సెంటర్స్ కు బాగా రీచ్ అయ్యేలా చేశాయి. ఇదే ఫార్ములాను అట్లీ షారుఖ్ కు ప్రయోగించాడు. షారుఖ్ లాంటి లెజెండ్ దొరికాడు కాబట్టి అట్లీ క్రియేటివ్ ఫ్రీడమ్ కు హద్దే లేకుండా పోయింది. ప్రతి ఫ్రేమ్ ను లావిష్ గా తీర్చిదిద్ది ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లాడు. యాక్షన్ లో అంతే భారీతనం కనిపించింది. హెలికాప్టర్ షాట్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులతో కావాల్సిన హంగులన్నీ చేర్చాడు. నేను ఎవర్ని అంటూ ప్రశ్నతో మొదలయ్యే షారుఖ్ క్యారెక్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. హీరోను హైజాకర్ లా చూపించడంతో కథలో ఏం జరగబోతోంది అనే ఇంట్రెస్ట్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచే మొదలవుతుంది. ప్రతి ప్రధాన పాత్రకు ఒక ప్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇవన్నీ ప్రేక్షకుల్లో వీళ్ల నేపథ్యం ఏంటనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. షారుఖ్ ఇప్పటిదాకా తను చేయని మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. అతన్ని ఇలా స్క్రీన్ మీద చూడటం అభిమానులకు పండగే. ఇక షారుఖ్ లోని హ్యూమర్ యాంగిల్నీ వాడుకున్నాడు అట్లీ. దర్శకుడు శంకర్ తరహాలో అట్లీ కూడా ప్రభుత్వాలని ప్రశ్నంచే కొన్ని కాంటెంపరరీ ఇష్యూస్ చూపించాడు. ఇవి సినిమాకు కావాల్సిన హుందాతనం తీసుకొచ్చాయి. ఎంత భారీ యాక్షన్ ఉన్నా…ఇదంతా ఎందుకు చేస్తున్నాడనే ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్ ను బలంగా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు. ఐపీఎస్ అధికారి నర్మదగా నయనతార నటన ఆకట్టుకుంటుంది. అలాగే ఆయుధ డీలర్ గా విజయ్ సేతుపతి చెలరేగిపోయాడు. విక్రమ్ సినిమా తర్వాత అతని విలనీ పదునుతేలింది. షారుఖ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ సీన్స్ ఈలలు వేయిస్తాయి. ప్రియమణి, సాన్యా మల్హోత్రాలకు మంచి క్యారెక్టర్స్ దొరికాయి. టెక్నికల్ గా చూస్తే అనిరుధ్ నేపథ్య సంగీతం, పాటలు మరో రేంజ్ కు సినిమాను తీసుకెళ్లాయి. సినిమాటోగ్రఫీ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ లో ఉంది. ఇక ఈ మాస్ ప్రపంచాన్ని క్రియేట్ చేసే క్రమంలో కొన్ని లాజిక్స్ మర్చిపోయాడు దర్శకుడు. ఇవి ప్రేక్షకులు పట్టించుకోరనే నమ్మకంతోనే అలా చేశాడనిపిస్తుంది. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ మరీ నాటకీయంగా అనిపిస్తాయి. అయినా తెరపై షారుఖ్ ను చూస్తూ ప్రేక్షకులు వాటిని మర్చిపోతారు.