నటీనటులు – వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్ తదితరులు
టెక్నికల్ టీమ్ – సంగీతం – మిక్కీ జె.మేయర్, సినిమాటోగ్రఫీ – ముఖేష్, ఆర్ట్ – అవినాస్ కొల్ల, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, రచన దర్శకత్వం – ప్రవీణ్ సత్తారు.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తున్నవి యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలే. మెగా హీరో వరుణ్ తేజ్ ఈ జానర్ లో చేసిన కొత్త సినిమా గాండీవధారి అర్జున. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించారు. ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
అర్జున్ (వరుణ్ తేజ్) ధైర్య సాహసాలు గల యువకుడు. సైన్యంలో పనిచేసిన అనుభవం అతనికి ఉంటుంది. ఓ సెక్యూరిటీ ఏజెన్సీ తరుపున యూకేలో పనిచేస్తుంటాడు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన కేంద్రమంత్రి ఆదిత్య రాజ్ (నాజర్) ను చంపేందుకు కొందరు కుట్ర చేస్తారు. ఆ కుట్ర నుంచి కేంద్రమంత్రిని కాపాడే బాధ్యత తీసుకుంటాడు అర్జున్. ఈ క్రమంలో అతనికి సపోర్ట్ గా ఉంటుంది కేంద్రమంత్రి ఆదిత్యరాజ్ పర్సనల్ సెక్రటరీ ఐరా ( సాక్షి వైద్య). భారీ కుట్ర నుంచి కేంద్రమంత్రిని అర్జున్ కాపాడాడా లేదా దీనికి సీ అండ్ జీ కంపెనీ ఓనర్ రణ్ వీర్ (వినయ్ రాయ్)కు ఉన్న సంబంధం ఏంటనేది తెరపై చూడాలి.
ఎలా ఉందంటే ?
ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు కావాల్సిన కథతో గాండీవధారి అర్జున సినిమాను రూపొందించారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ సినిమాలో ప్రేమ, సెంటిమెంట్, యాక్షన్ వంటి ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. అయితే ఈ అంశాలన్నీ కలిపి ఓ పర్పెక్ట్ యాక్షన్ మూవీ చేయలేకపోయాడు దర్శకుడు. ఏ భావోద్వేగమూ ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేయలేకపోయింది. సినిమా చూస్తున్నంత ఏ దశలోనూ మనం సినిమాలో ఇన్వాల్వ్ కాలేకపోతాం. ఫస్టాఫ్ కొంత ఫర్వాలేదనిపించినా…సెకండాఫ్ మొత్తం మెకానికల్ గా తయారైంది సినిమా. తెరపై ఏదో జరుగుతూ వెళ్తోంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో చూపించిన కొన్ని ఎన్విరాన్ మెంటల్ డాక్యుమెంటరీస్ మరీ బోర్ కొట్టిస్తాయి.
మానవాళికి కావాల్సిన అంశాలను సందేశాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. అయితే ఓ కమర్షయిల్ కథలో ఆ ఫార్మేట్ కు తగినట్లు ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా అవి లేవు. భారీ మేకింగ్ ఆకట్టుకుంటుంది. వరుణ్ తేజ్ అర్జున్ క్యారెక్టర్ లో మెప్పించాడు. యాక్షన్, ఎమోషన్, లవ్ వంటి అన్ని సన్నివేశాల్లో వరుణ్ నటన బాగుంది. సాక్షి వైద్య సినిమా మొత్తం ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ చేసింది. ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది. వరుణ్, సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్ వంటి కొన్ని పాత్రలు తప్ప సినిమాలో మిగతా క్యారెక్టర్స్ ఏమాత్రం ఇంపాక్ట్ కలిగించేలా లేవు. టెక్నికల్ గా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఓకే…అయితే కథలో బలం లేనప్పుడు ఈ హంగులన్నీ ఉన్నా ఉపయోగం లేనట్లే. భారీ యాక్షన్ సినిమాల మేకింగ్ లో ఘోస్ట్ తర్వాత డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు మరోసారి తడబడినట్లే అనుకోవాలి.