నటీనటులు – షారుఖ్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ తదితరులు
టెక్నికల్ టీమ్ – సినిమాటోగ్రఫీ – సీకే మురళీధరన్, మనుశ్ నందన్, ఎడిటింగ్ – రాజ్ కుమార్ హిరాణి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – అమన్ పంత్, సాంగ్స్ – ప్రీతమ్, నిర్మాణం – జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యానర్స్, దర్శకత్వం – రాజ్ కుమార్ హిరాణి
రెండు వరుస రికార్డ్ హిట్స్ తో బాలీవుడ్ లో జోరు చూపిస్తున్నారు బాద్షా షారుఖ్ ఖాన్. ఆయన నటించిన పఠాన్, జవాన్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. ఇక ఈ క్రమంలో వచ్చిన మూడో సినిమా డంకీపై విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇవాళ థియేటర్స్ లోకి వచ్చిన డంకీ ఆ అంచనాలను అందుకుందా లేదా రివ్యూలో చూద్దాం.
కథేంటంటే ?
పంజాబ్ లో ఓ చిన్న ఊరికి హార్డీ సింగ్ ( షారుఖ్) ఖాన్ వస్తాడు. ఆ ఊరిలో మన్ను (తాప్సి), సుఖి (వికీ కౌశల్), బుగ్గు (విక్రమ్ కొచ్చర్), బల్లి (అనిల్ గ్రోవర్) ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. వాళ్లందరి సమస్యలు ఇంగ్లండ్ వెళితే తీరిపోతాయి. కానీ వారి దగ్గర ఇంగ్లండ్ వెళ్లేందుకు సరిపోయేంత డబ్బు, వీసాలకు అర్హత పొందేంత చదువూ ఉండదు. వీళ్లకు సాయం చేయాలనుకుంటాడు హార్డీ సింగ్. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంగ్లండ్ వెళ్లేందుకు వీలు కుదరదు. అలాంటి టైమ్ అక్రమ మార్గంలో ఇంగ్లండ్ వెళ్లాలనుకుంటారు. ఆ క్రమంలో వీరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, దేశాలు దాటి హార్డీ, మన్ను, సుఖి, బుగ్గు, బల్లి ఇంగ్లండ్ వెళ్లగలిగారా లేదా అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే ?
ఇంగ్లండ్ లో మొదలైన డంకీ కథ పంజాబ్ లోని ఓ పల్లెటూరిలో ల్యాండ్ అవుతుంది. అక్కడ ప్రజా జీవితం, సామాజిక పరిస్థితులు, అందులో ఓ నాలుగు పాత్రలను మనసుకు హత్తుకునేలా చిత్రీకరించాడు. రాజ్ కుమార్ హిరాణీ సినిమాల్లోని ప్రత్యేకత నవ్విస్తూ ఆలోచింపజేయడం, హార్ట్ టచింగ్ గా ఉండటం…ఈ అంశాలు డంకీలోనూ కనిపిస్తాయి. షారుఖ్ ఇమేజ్ లోకి తాను వెళ్లకుండా తన తరహాలోనే డంకీ సినిమాను రూపొందించాడు రాజ్ కుమార్ హిరాణీ. మన్ను, సుఖి, బుగ్గు, బల్లి నేపథ్యాలు, వారి క్యారెక్టర్స్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తొలి భాగం సినిమా ప్రధాన పాత్రల ఇంట్రడక్షన్స్ తో సరదాగా సాగితే..ద్వితీయార్థం మాత్రం ఇంగ్లండ్ వెళ్లేందుకు వీళ్లు పడే స్ట్రగుల్స్ తో ఎమోషనల్ గా మారుతుంది.
హార్డీ, మన్ను క్యారెక్టర్స్ మధ్య సాగే ప్రేమకథ ఆకట్టుకుంటుంది. మన దేశాన్ని వదిలి ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లే భారతీయుల భావోద్వేగాలకు అద్దం పట్టేలా కథా కథనాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే లో ఎలాంటి హంగులు, ఆర్భాటాలకు పోకుండా తను అనుకున్న కథను అనుకున్నట్లుగా నిజాయితీగా తెరకెక్కించాడు. కొంత నెమ్మదిగా సినిమా సాగినా మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఇక హార్డీ క్యారెక్టర్ లో షారుఖ్ ఖాన్ అన్ని రకాల ఎమోషన్స్ పండించాడు. తాప్సీ, వికీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ తమ క్యారెక్టర్స్ మేరకు వినోదాన్ని, ఎమోషన్ ను క్రియేట్ చేయగలిగారు. నేపథ్య సంగీతం సినిమా మూడ్ ను కంటిన్యూ చేయగా..ప్రీతమ్ పాటలు ఆకట్టుకున్నాయి. టెక్నికల్ గా డంకీ ఉన్నత స్థాయిలో ఉంది.