నటీనటులు – చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు
టెక్నికల్ టీమ్ – ఎడిటింగ్ – అమర్ రెడ్డి కుడుముల, సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ్ రామస్వామి, మ్యూజిక్ – గోపీ సుందర్, స్టోరీ స్క్రీన్ ప్లే – గోపీ మోహన్, ప్రొడ్యూసర్ – ఎంఎస్ రామ్ కుమార్, డైరెక్టర్ – సాయి కిషోర్ మచ్చా
దీపావళి వీక్ సినిమాలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగానే మరో ఎంటర్ టైనింగ్ మూవీ ధూం ధాం థియేటర్స్ లోకి వచ్చింది. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకుంది. మరి థియేటర్స్ లో ధాం ధాం సినిమా ఎంతగా వినోదాన్ని ఇచ్చింది అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
రామరాజు (సాయికుమార్) ఒక బిల్డర్. అతనికి తన కొడుకు కార్తికేయ(చేతన్ కృష్ణ) అనే ప్రాణం. తన కొడుకే అన్నింట్లో ముందు ఉండాలని కోరుకుంటాడు రామరాజు. ఈ తండ్రీ కొడుకుల ప్రేమను సవాల్ చేస్తూ కార్తికేయను సుహానా (హెబ్బా పటేల్ ) అనే అమ్మాయి ప్రేమించినట్లు నాటకం ఆడుతుంది. పోలెండ్ లో కార్తికేయను కలుసుకోమని చెబుతుంది. అలా కలుసుకున్న కార్తికేయ సుహానా ప్రేమ నాటకం అని తెలుసుకుంటాడు. తర్వాత నిజంగానే కార్తికేయను ప్రేమిస్తుంది సుహానా. ఇంతలో కార్తికేయకు పోలెండ్ లోనే ఓ పెళ్లి సంబంధం చూస్తాడు రామరాజు. కార్తికేయ ఈ పెళ్లి చేసుకున్నాడా, సుహానా ప్రేమను అంగీకరించాడా, సుహానా కుటుంబంతో కార్తికేయ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి అనేది తెరపై చూడాలి.
ఎలా ఉందంటే
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథకు ఓ చిన్న లవ్ స్టోరీ కలిపి అల్లుకున్న స్క్రిప్ట్ ఇది. కొడుకంటే ఎంత ప్రేమో చూపించే సన్నివేశాలతో సినిమా బిగిన్ అవుతుంది. కొడుకు గొంతులో చేప ముళ్లు ఇరుక్కుదని, ఇంట్లో చేపల వంటనే నిషేధిస్తాడు రామరాజు. తండ్రి కోసం ఎలాంటి రిస్కైనా చేయాలనుకుంటాడు కొడుకు కార్తికేయ. ఇలాంటి తండ్రీ కొడుకుల అనుబంధంలో హీరోయిన్ ప్రేమ ఎలా సక్సెస్ అయ్యింది అనేది ఈ సినిమాలో ఆకట్టుకునేలా చూపించారు.
తొలిభాగం సినిమాలో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, మంచి సాంగ్స్ తెరకెక్కించారు. ఇందులోనే హీరో ఫ్రెండ్స్ బ్యాచ్, హీరోయిన్ ఫ్రెండ్స్ బ్యాచ్ చేసే సందడి చూస్తాం. హీరో ఫ్రెండ్స్ గా ప్రవీణ్, నవీన్ నేని నవ్విస్తారు. హీరోయిన్ ప్రేమ నాటకం హీరోకు తెలియడం ట్విస్ట్ అయితే. ..హీరోయిన్ కుటుంబ నేపథ్యం గురించి, ఆ కుటుంబంతో తన తండ్రికి ఉన్న వైరం గురించి, గతంలో తాము హీరోయిన్ ఫాదర్ ఊరికి వెళ్లి చేసిన ఓ గొడవ గురించి తెలియడం మరో ట్విస్ట్. ఇవన్నీ తెలిసి హీరోయిన్ తండ్రితో అతని కుటుంబంతో హీరో కార్తికేయ ఎలా చేరువయ్యాడు అనేది ఎంటర్ టైనింగ్ గా చూపించారు దర్శకుడు సాయికిషోర్ మచ్చా
సెకండాఫ్ లో పెళ్లి ఇంట్లో వెన్నెల కిషోర్ చేసిన కామెడీ, ఆ హంగామా అంతా సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. సెకండాఫ్ లో గంట సేపు కావాల్సినంత ప్రేక్షకులు నవ్వుకుంటారు. కామెడీ టైమింగ్, వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్స్, మన హీరోల గురించి చెప్పిన స్ఫూఫ్ డైలాగ్స్ వినోదాన్ని అందిస్తాయి.
హీరో చేతన్ కృష్ణ తన పాత్ర మేరకు ఆకట్టుకునేలా నటించాడు. ఫస్ట్ టైమ్ ఒక కమర్షియల్ మూవీ అటెంప్ట్ చేసి మెప్పించాడు. డ్యాన్సులు, ఫైట్స్ లో సహజంగా కనిపించాడు. హెబ్బా పటేల్ ఎక్సిపీరియన్స్ సుహానా క్యారెక్టర్ లో నటించడంలో తెలుస్తోంది. సాయి కుమార్ కు ఇలాంటి ఫాదర్ రోల్ కొట్టిన పిండి. మిగతా కాస్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా తమ క్యారెక్టర్స్ కు సెట్ అయ్యారు. మన ఆడియెన్స్ పల్స్ తెలిసిన గోపీమోహన్ స్క్రిప్ట్ ధూం ధాం కు హైలైట్ అనుకోవచ్చు. సాయికిషోర్ మచ్చా దర్శకుడిగా తన స్టైల్ చూపించాడు. ఇలాంటి ఎంటర్ టైనింగ్ మూవీస్ చేసే సత్తా తనలో ఉంది ప్రూవ్ చేశాడు. గోపీసుందర్ మ్యూజిక్ ధూం ధాం సినిమాకు ప్రాణంగా నిలిచింది. ఏ స్టార్ హీరోకైనా సరిపోయేంత మంచి ట్యూన్స్, బీజీఎం ఇచ్చాడు గోపీసుందర్. ఈ వీక్ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూడాలనుకుంటే ధూం ధాంకు వెళ్లొచ్చు.
రేటింగ్ 3/5