రివ్యూ – డీమాంటీ కాలనీ 2

నటీనటులు – అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్, అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవింద్ రాజన్, సర్జనో ఖాలిద్, అర్చన రవిచంద్రన్

టెక్నికల్ టీమ్ – మ్యూజిక్ – సామ్ సీఎస్, సినిమాటోగ్రఫీ – హరీశ్ కన్నన్, ఎడిటర్ – కుమరేష్.డి., సమర్పణ – ఎన్ శ్రీనివాస రెడ్డి, ప్రొడ్యూసర్స్ – బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి, రచన దర్శకత్వం – అజయ్ ఆర్ జ్ఞానముత్తు

స్క్రిప్ట్ రైటింగ్, ఫిలిం మేకింగ్ అల్లాటప్పా విషయాలని అనుకునే వారి కళ్లు తెరిపించే సినిమాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. ఎంత బలమైన కథ రాయాలి, దాన్ని తెరపై ఎంత ఆసక్తికరంగా చూపించాలి అనేది ఇలాంటి సినిమాలే నేర్పిస్తుంటాయి. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు డీమాంటీ కాలనీ 2తో ఇలాంటి ఒక స్ఫూర్తినిచ్చే ప్రయత్నం చేశాడు. హారర్ థ్రిల్లర్ అంటే ఓ పెద్ద బంగ్లా ..అందులో దెయ్యం, కొందరు చేసే కామెడీ కాదని ఈ సినిమా చూపిస్తుంది. మొదటి సీన్ నుంచే ప్రేక్షకుల్ని కథలో లీనం చేసిన డీమాంటీ కాలనీ 2 ఓవరాల్ గా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

డీమాంటీ కాలనీ 1లో జరిగిన అనూహ్య ఆత్మహత్యలు, వాటి కారణాలు మరోసారి గుర్తు చేస్తూ డీమాంటీ కాలనీ 2 సినిమా ప్రారంభమవుతుంది. డెబీ (ప్రియ భవానీశంకర్)..సామ్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతనికి క్యాన్సర్ ఉన్నా పెళ్లి చేసుకుంటుంది. క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న టైమ్ లో సామ్ ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ ఘటనతో డెబీ కుంగిపోతుంది. చనిపోయే ముందు సేకరించిన సామ్ స్పెర్మ్ తో వైద్య సహాయంతో బిడ్డను కనాలని ప్రయత్నిస్తుంటుంది. ఇంట్లో వాళ్లు డెబీ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మృతి చెందిన తన ప్రియుడు సామ్ కోరిక మేరకు చైనీస్ రెస్టారెంట్ ప్రారంభిస్తుంది డెబీ. ఈ క్రమంలో సామ్ ఆత్మ తనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు డెబీ గుర్తిస్తుంది. అంకుల్ డాక్టర్ రిచర్డ్ ( అరుణ్ పాండియన్ )తో కలిసి బౌద్ధ మత గురువును ఆశ్రయిస్తుంది. సామ్ ఆత్మను కలుసుకోవడం సాధ్యమేనని..అందుకు ఓ ప్రమాదకరమైన పద్ధతి ఉందని చెబుతారు మత గురువులు. సామ్ ఆత్మ చెప్పేది వినేందుకు డెబీ ఎలాంటి సాహసం చేసింది. ఆ క్రమంలో శ్రీనివాస్(అరుల్ నిధి), రఘు(అరుల్ నిధి) గురించి డెబీ ఏం తెలుసుకుంది. డీమాంటీ ప్రభావంతో ఇంకెన్ని ఆత్మహత్యలు జరిగాయి. వీటి వెనక ఉన్నదెవరు..ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెరపై చూడాలి.

ఎలా ఉందంటే

డెబీ, సామ్ హృద్యమైన ప్రేమ కథతో డీమాంటీ కాలనీ 2 కథ మొదలవుతుంది. కేన్సర్ ఉన్నా ప్రేమించినవాడినే పట్టుబట్టి పెళ్లి చేసుకుంటుంది డెబీ. సామ్ ఆత్మహత్యతో కుంగిపోయిన డెబీ ప్రేక్షకల్ని ఎమోషనల్ చేస్తుంది. సామ్ ఆత్మ కోసం డెబీ తీసుకునే నిర్ణయాలన్నీ ఆమె లవ్ ఎపిసోడ్స్ చూశాక ఎంతో కన్విన్సింగ్ గా అనిపిస్తాయి. డీమాంటీ కాలనీలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, వీటి వెనకున్న రహస్యం ఏంటి అనేది ప్రతి సీన్ కు ముడివేసి పక్కాగా స్క్రీన్ ప్లే చేశారు దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు. కీ సీన్స్ రివైండ్ చేస్తూ, ఇంపార్టెంట్ డైలాగ్స్ మళ్లీ గుర్తు చేస్తూ కథ నుంచి మనం ఎక్కడా డీవియేట్ కాకుండా చేశారు. డీమాంటీ కాలనీ 2 కథ కోసం దర్శకుడు చేసిన కసరత్తు, మేకింగ్ లో చూపించిన శ్రద్ధను ప్రశంసించాల్సిందే. డీటెయిల్డ్ గా, డెప్త్ గా ఈ స్క్రిప్ట్ చేశారు. శక్తివంతులైన బౌద్ధ మత గురువులనే ఎదిరించే బలమైన దుష్ట శక్తి చేసే హంగామా అంతా థ్రిల్ కలిగిస్తుంది.

కథకు తగిన నటీనటులను ఎంచుకోవడమే సగం పని పూర్తిచేసినట్లు అని ఫిలిం మేకింగ్ లో ఒక సామెత ఉంది. డీమాంటీ కాలనీ 2లో కాస్టింగ్ అంత పర్పెక్ట్ గా కుదిరింది. డెబీగా ప్రియ భవానీ శంకర్ ఆకట్టుకునేలా నటించింది. ఆమె ఈ సినిమాకు హీరో అని చెప్పొచ్చు. అరుల్ నిధి శ్రీనివాస్, రఘు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు. డాక్టర్ రిచర్డ్ గా అరుణ్ పాండియన్ క్యారెక్టర్ కీలకంగా సాగుతుంది. టెక్నికల్ గా చూస్తే సామ్ సీఎస్ మ్యూజిక్ డీమాంటీ కాలనీ 2కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. హారర్, థ్రిల్లర్స్ లో ఒక టిపికల్ సౌండింగ్ తో బీజీఎం, పాటలు ఉంటాయి. ఆ ట్రెండ్ లోనే సరికొత్త పాటలు కంపోజ్ చేశాడు సామ్ సీఎస్. బీజీఎం అయితే ఈ మూవీలోని ఎఫెక్ట్ ను మరోస్థాయికి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ, సీజీ వర్క్, ఎడిటింగ్ అన్నీ టాప్ క్వాలిటీతో ఉన్నాయి. ఒక మంచి సినిమాటిక్ ఎక్సీపీరియన్స్ ఇచ్చే మూవీకి వెళ్లాలనుకుంటే డీమాంటీ కాలనీ 2 చూడాల్సిందే.

రేటింగ్ 3/5