రివ్యూ – భారతీయుడు 2

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక సెన్సేషన్ భారతీయుడు. 90లో వచ్చిన ఈ సినిమా దర్శకుడిగా శంకర్ ను, హీరో కమల్ హాసన్ ను ఉన్నతస్థానంలో కూర్చోబెట్టింది. లంచం దేశానికి పట్టిన చీడగా చెబుతూ భారతీయుడు సినిమాను రూపొందించారు శంకర్. సందేశం, వినోదం కలిసి ఈ సినిమాకు సీక్వెల్ గా ఇన్నేళ్ల విరామం తర్వాత భారతీయుడు 2 సినిమా తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ భారీ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారతీయుడు 2 ఎలా ఉందో రివ్యూలో చూస్తే..

కథేంటంటే
బార్కింగ్ డాగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతుంటాడు అరవింద్ (సిద్ధార్థ్). అతని ప్రేయసి దిశ (రకుల్ ప్రీత్ సింగ్). బార్కింగ్ డాగ్స్ ఛానెల్ ద్వారా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తెస్తుంటాడు అరవింద్. కానీ అతను చేసే వీడియోలతో ఎలాంటి మార్పు రాదు. ఈ సమయంలో సేనాపతి (భారతీయుడు) మళ్లీ ఇండియాకు రావాలనే సోషల్ మీడియా ఉద్యమం మొదలవుతుంది. ఇది చూసి తైపీలో ఉన్న సేనాపతి మళ్లీ ఇండియాకు తిరిగొస్తాడు. అవినీతి పరులను అంతమొందిస్తాడు. ఈ పోరాటంలో భారతీయుడు తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

పునాది లేని భవంతి ఎన్ని హంగులతో కట్టినా అది నిలబడదు. సినిమాలకు కథ కూడా అంతే. శంకర్ గతంలో చేసిన భారీ బడ్జెట్ మూవీస్ అన్నింట్లో ఆ హంగుల కన్నా కథే బలంగా, ఆకర్షణగా ఉండేది. భారతీయుడు 2లో ఆ కథాబలం లేకపోవడం విచారకరం. ఇంత భారీ బడ్జెట్, హెలికాప్టర్లు, క్రూయిజ్ పడవలు, బంగారు భవంతులు చూపిస్తూ అందులో ఆత్మలాంటి కథనే పట్టించుకోలేదు దర్శకుడు. దీంతో భారతీయుడు 2 ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది.

సేనాపతి ఇండియాకు రావడం ఇక్కడి అవినీతి పరులను చంపేయడం ఎవరికీ దొరకకుండా పారిపోవడం సినిమా చివరిదాకా ఇదే తంతు కొనసాగింది. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ ఎంతమందిని కొట్టినా దానికో హద్దు ఉండేది. ఈ సీక్వెల్ లో వందలాది మందిని తప్పించుకుని మాయమవుతాడు సేనాపతి. అతనికి మించిన సూపర్ హీరో లేడన్నట్లు ఆ పాత్రను మార్చారు. చంపడం, పారిపోవడంతో ప్రేక్షకులుకు విసుగొస్తుంది. ఈ హంగామా అంతా సృష్టించి చివరలో భారతీయుడు 3 అనౌన్స్ చేసి సినిమాను ముగించారు.

కమల్ హాసన్ నటుడిగా ఎక్కడా ఫెయిల్ కాలేదు. దర్శకుడిగా శంకర్ తప్పు. సిద్ధార్థ్, రకుల్, ప్రియ భవానీ శంకర్, ఎస్ జే సూర్య వంటి నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ బాగున్నా అనిరుధ్ మ్యూజిక్ మెప్పించలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి.