నటీనటులు – కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు
టెక్నికల్ టీమ్- మాటలు: మధు శ్రీనివాస్, ఎడిటర్: సత్య జి, సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్, మ్యూజిక్ (పాటలు) – రధన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్, ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్, దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు
గతేడాది హీరో కార్తికేయ బెదురులంక అనే సినిమాతో హిట్ అందుకున్నారు. అదే ఉత్సాహంలో ఆయన ఈ రోజు భజే వాయు వేగం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించగా…దర్శకుడు ప్రశాంత్ రెడ్డి రూపొందించారు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన భజే వాయు వేగం సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
వరంగల్ జిల్లా రాజన్నపేట గ్రామానికి చెందిన వెంకట్ (కార్తికేయ) తల్లిదండ్రులు అప్పుల బాధతో చనిపోతారు. వెంకట్ తండ్రి స్నేహితుడైన తనికెళ్ల భరణి వెంకట్ ను చేరదీసి తన కొడుకు రాజు (రాహుల్ టైసన్) తో పాటు పెంచుకుంటాడు. వెంకట్ క్రికెటర్ కావాలనే కలగంటాడు. చిన్నప్పటి నుంచి బాగా క్రికెట్ ఆడుతుంటాడు. కొడుకు ప్రతిభ చూసిన తండ్రి తనికెళ్ల భరణి అతనికి కోచింగ్ ఇప్పిస్తాడు. హైదరాబాద్ వెళ్లిన వెంకట్ క్రికెటర్ గా మ్యాచ్ లు ఆడుతుంటాడు. రాజు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటాడు. తమను ఎంతో ప్రేమగా చూసుకున్న తండ్రికి తీవ్రమైన అనారోగ్యం కలుగుతుంది. అతనికి చికిత్స కోసం 20 లక్షల రూపాయలు కావాల్సివస్తాయి. ఆ టైమ్ లో డబ్బు కోసం వెంకట్ ఏం చేశాడు. రాజు తన సోదరుడికి ఎలా సహాయం చేశాడు. వీళ్లిద్దరు తండ్రిని కాపాడుకున్నారా లేదా , నగర మేయర్ జార్జ్ (శరత్ లోహితస్వ), మేయర్ తమ్ముడు డేవిడ్ (రవిశంకర్) లతో వెంకట్, రాజుకు ఎందుకు వైరం ఏర్పడింది. ఇందు(ఐశ్వర్య మీనన్)తో వెంకట్ ప్రేమ ఎలా సాగింది అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
మన లక్ష్యాన్ని ఇష్టాన్ని పక్కనపెట్టైనా సరే మన వాళ్లని బాగా చూసుకోవాలి అనే కాన్సెప్ట్ తో భజే వాయు వేగం సినిమాను తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ రెడ్డి. సినిమా ప్రారంభంలోనే మేయర్ కొడుకును చంపిన నేరానికి పోలీసులు వెంకట్ ను అరెస్ట్ చేస్తారు. అక్కడి నుంచి తనెవరు, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటని హీరో చెబుతుండగా కథ రివీల్ అవుతుంది. నగర మేయర్ జార్జ్, అతని సోదరుడు డేవిడ్ గతాన్ని కూడా చిన్న ప్లాష్ బ్యాక్ లో యానిమేషన్ లో ఆకట్టుకునేలా చూపించారు. అనాథలా మారిన తనను కొడుకులా పెంచిన ఓ గొప్ప తండ్రి కోసం క్రికెటర్ కావాలనే తన లక్ష్యాన్ని పక్కనపెట్టేస్తాడు వెంకట్. మన విజయాన్ని చూసి మన వాళ్లు ఆనందించలేనప్పుడు ఆ సక్సెస్ ఉన్నా లేకున్న ఒకటే అనే డైలాగ్ హీరో క్యారెక్టర్ చేసే త్యాగానికి డెస్టిఫికేషన్ లాంటిది.
సినిమా ఫస్టాఫ్ లో కథలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశాడు దర్శకుడు. అలాగే హీరో వెంకట్, హీరోయిన్ ఇందు మధ్య చిన్న లవ్ స్టోరి, ఒక సాంగ్ తో ఎంటర్ టైన్ చేశాడు. తండ్రికి అనారోగ్యం కలిగి హైదరాబాద్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కథలో సీరియస్ నెస్, ఇంటెన్సిటీ పెరుగుతుంది. తండ్రి వైద్యానికి డబ్బు కోసం వెంకట్ బెట్టింగ్ లో డబ్బు గెల్చినా విలన్లు ఇవ్వకపోవడంతో కథ మలుపులు తిరుగుతుంటుంది. అన్న కొడుకునే డేవిడ్ చంపడం, ఆ నేరంలో అనూహ్యంగా వెంకట్, రాజు ఇరుక్కోవడంతో ప్రేక్షకులు వీళ్లు ఈ నేరం నుంచి ఎలా బయటపడతారు అనే థ్రిల్ కు లోనవుతారు.
దర్శకుడు ప్రశాంత్ రెడ్డి భజే వాయు వేగం కథను తెరకెక్కించడంలో పూర్తి స్పష్టత చూపించాడు. సినిమాటిక్ లిబర్టీ చాలా తక్కువ తీసుకుంటూ వీలైనంత సహజంగా క్యారెక్టర్ లు ప్రవర్తించేలా చూసుకున్నాడు. హీరోను సూపర్ హీరోలా ఎక్కడా చూపించలేదు. తన సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేయాలో అంతవరకే హీరోయిజాన్ని ఉపయోగించాడు ప్రశాంత్ రెడ్డి. వెంకట్ క్యారెక్టర్ లో కార్తికేయ అన్ని ఎమోషన్స్ పర్ పెక్ట్ గా పలికించాడు. ఇందులో మిగతా అంశాల కంటే ఎమోషన్, యాక్షన్ పార్ట్ ఎక్కువ. రాజు పాత్రలో రాహుల్ టైసన్ బాగా కుదిరాడు. అతని అమాయకత్వంతో కూడిన నటన రాజు క్యారెక్టర్ కు సెట్ అయ్యింది. మేయర్ జార్జ్ గా శరత్ లోహితస్వ, అతని సోదరుడు డేవిడ్ గా రవిశంకర్ విలనీతో మెప్పించారు. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ ఇంటర్వెల్ లో ఒక చిన్న షాక్ ఇస్తుంది. ఆమె తన ప్రేమికుడు కోసం ఏం చేసేందుకైనా సిద్ధపడుతుంది. తనికెళ్ల భరణికి ఇంత లెంగ్తీ, ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇటీవలకాలంలో దక్కలేదు. యూవీ కాన్సెప్ట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా మొత్తం కనిపించాయి. సెట్టయ్యిందే పాట అప్పటిదాకా ఉన్న ఎమోషన్ నుంచి రిలీఫ్ ఇచ్చింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, కపిల్ కుమార్ ఇచ్చిన బీజీఎం ఆకట్టుకున్నాయి. భజే వాయు వేగం సినిమా ఫ్యామిలీతో కలిసి ఆడియెన్స్ చూడొచ్చు.
రేటింగ్ 3/5