నటీనటులు – కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య తదితరులు
టెక్నికల్ టీమ్ – ఎడిటింగ్: విప్లవ్. సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, సంగీతం: మణిశర్మ, నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన – దర్శకత్వం : క్లాక్స్.
యుగాంతం నేపథ్యంలో తెరకెక్కిన హాలీవుడ్ మూవీ 2012 ఘన విజయం సాధించింది, ఆ మధ్య తెలుగులో నిత్యా మీనన్, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో స్కైలాబ్ అనే సినిమా వచ్చింది. ఈ తరహా కథతో రూపొందిన లేటెస్ట్ మూవీ బెదురులంక 2012. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
2012 డిసెంబర్ నెలలో యుగాంతం వస్తుందనే మూఢ నమ్మకాలతో భయపడే బెదురులంక అనే ఊరి ప్రజలను అలాంటి నమ్మకాలు ఏవీ లేని శివ (కార్తికేయ) అనే యువకుడు ఎలా నచ్చజెప్పి కాపాడాడు అనేది స్థూలంగా ఈ సినిమా కథ. యుగాంతం అనే భయాన్ని ఊరి ప్రజల్లో కలిగించి వారిని దోచుకుందామని చూసే కొందరు వ్యక్తుల కుట్రలను హీరో ఎలా ఆపగలిగాడు అనేది వినోదాత్మకంగా తెరకెక్కించాడు కొత్త దర్శకుడు క్లాక్స్. ఇందులో మతం, మత విశ్వాసాలు, దేవుడిపై మనకుంటే నమ్మకాలు, భయాలు, మనిషి స్వార్థం వంటి అన్ని అంశాలను చూపించే ప్రయత్నం చేశాడు. యుగాంతం ఆగాలంటే ఊరి బంగారమంతా పోగేసి శివలింగం, శిలువ తయారు చేసి గంగలో విడిచేయాలని ఊరిలోని కొందరు స్వార్థపరులు జనానికి చెబుతారు. ఇది నిజమేనని నమ్మిన ఊరి జనం విలన్ లు చెప్పినట్లు చేసేందుకు రెడీ అవుతారు. వారిని శివ ఎలా అడ్డుకున్నాడు. చిత్ర (నేహాశెట్టి)తో అతను ప్రేమ కథ ఎలా సుఖాంతమైంది అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
యుగాంతం నేపథ్యంలో మూఢనమ్మకాలు, దేవుడు, మనిషిలోని స్వార్థం వంటి అంశాలను తీసుకుని సందేశాత్మకంగా, వినోదాన్ని అందిస్తూ సినిమా రూపొందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు క్లాక్స్. అయితే అసలు కథలోకి వెళ్లేందుకు అతను చాలా సమయం తీసుకోవడం ఈ సినిమా ఫలితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. బెదురులంక ఊరిలోని ప్రజల తీరు, అక్కడి పాత్రల పరిచయం వంటి డీటెయిల్స్ కోసం ఇంటర్వెల్ దాకా సినిమా ముందుకు కదలదు. ఇక ద్వితీయార్థంలో కథ ఊపందుకున్నా…అదంతా కామెడీ క్రియేట్ చేసేందుకే ఎక్కువ ఉపయోగపడింది. యుగాంతం పేరు చెప్పి ఊరి ప్రజలను దోచుకోవాలనుకునే కొందరి ప్లాన్స్, ఆ నేపథ్యంలో దేవుడు, భక్తుడి నమ్మకాలు వంటి వాటిపై రాసుకున్న కొన్ని డైలాగ్స్, సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. హీరో హీరోయిన్ల ప్రేమ కథలో అర్థం లేదు. అసలు వాళ్లెందుకు ప్రేమించుకున్నారో తెలియదు. చిన్నప్పటి స్నేహమని చెప్పినా..అందుకు ఒక్క సీన్ చూపించలేదు.
ఊరి నుంచి వెలివేసిన తర్వాత శివ..తిరిగి ఆ ఊరి ప్రజలను ఎలా కాపాడాడు అనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే ప్రేక్షకులు ఊహించగలిగేలా స్క్రీన్ ప్లే ఉండటంతో చివరిదాకా ఆ థ్రిల్ కలగదు. టెక్నికల్ గా చూస్తే కొత్త దర్శకుడిగా క్లాక్స్ తన ఎంతో కొంత తన ఇంపాక్ట్ చూపించాడు. మణిశర్మ పాటలు ఆకట్టుకోకున్నా…బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపిస్తుంది. శివ పాత్రలో అతని నటన బాగుంది. చిత్రగా నేహా శెట్టి గ్లామర్ చూపించేందుకే ఎక్కువ ఉపయోగపడింది. ఇతర పాత్రల్లో అజయ్ ఘోష్, గోపరాజు రమణ, రాంప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రల మేరకు మెప్పించారు. మొత్తంగా కార్తికేయ తన కెరీర్ లో ఓ డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు. ఇది కమర్షియల్ గా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.