రివ్యూ – “డీజే టిల్లు”ను ఫాలో అయిన “బబ్లు గమ్”

నటీనటులు – రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల తదితరులు

టెక్నికల్ టీమ్ – సంగీతం: శ్రీచరణ్ పాకాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు,
బ్యానర్లు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రచన, దర్శకత్వం: రవికాంత్ పేరేపు

యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా బబ్లు గమ్. ఈ సినిమాలో మానస హీరోయిన్ గా నటించింది. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించారు. అడల్ట్ కంటెంట్ తో ఏ సర్టిఫికెట్ పొందిందిన ఈ సినిమా ఇవాళ థియేటర్స్ లోకి వచ్చింది. బబ్లు గమ్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

డీజే కావాలనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుర్రాడు ఆదిత్య (రోషన్). ఓ పార్టీలో జాను (మానస చౌదరి)ని చూసి లవ్ చేస్తాడు. ఆమె డబ్బున్న అమ్మాయి. ప్రేమా గీమా వంటివి పెద్దగా పట్టించుకోదు. అబ్బాయి అంటే యూజ్ అండ్ త్రో వరకే అని భావిస్తుంది. డీజే ప్లేయర్ గా ఆది టాలెంట్ చూసి అతన్ని ఇష్టపడుతుంది. ఓ పార్టీలో జాను ఫ్రెండ్ చేసిన పనికి ఆది తప్పు భరించాల్సి వస్తుంది. అందరి ముందూ ఆదిని అవమానపరుస్తుంది జాను. అప్పటి నుంచి ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు ఆది. ఈ క్రమంలో వీరి ప్రేమ కథ ఎలా మలుపులు తిరిగింది అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

గతేడాది రిలీజై మంచి సక్సెస్ అందుకున్న డీజే టిల్లు సినిమాను ఫాలో అయ్యింది బబుల్ గమ్. ఈ సినిమాలో హీరో ఆదిత్య ఓ మధ్య తరగతి కుర్రాడిగా ఉంటూ డీజేగా పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. డీజే టిల్లులో రాధిక లాగే ప్రేమపై పెద్దగా నమ్మకం లేని హీరోయిన్ జాను ఆదిని ఇన్ సల్ట్ చేస్తుంది. ఇక ఆమెపై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఆది చేసే పనులు, వచ్చే రివేంజ్ పాటతో బబ్లు గమ్ చప్పగా సాగుతుంది. హీరోయిన్ హీరో గొప్పదనం తెలుసుకుని రియలైజ్ అవడం కూడా రొటీనే. హీరో క్యారెక్టర్ నేపథ్యం, హీరోయిన్ తో అతని ప్రేమ వంటి అంశాలేవీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించవు. హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ పేరుతో రొమాన్స్ మాత్రమే చూపించారు. వీరి మధ్య ప్రేమ ఉందనే అనే ఫీలింగ్ ఎవరికీ కలగదు. యూత్ ఆడియెన్స్ కొందరికి మాత్రమే ఇలాంటి అడల్ట్ సీన్స్ నచ్చుతాయి. ఇంటర్వెల్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా…మళ్లీ క్లైమాక్స్ రొటీన్ గానే చూపించారు. ఫస్ట్ సినిమాకే ఓవర్ నైట్ స్టార్ డమ్ కోసం రోషన్ ఇలాంటి సినిమా చేశాడని అనుకోవచ్చు. దర్శకుడు రవికాంత్ పేరేపు ఈ సినిమాతో కొత్తగా తెచ్చుకునే గుర్తింపేమీ ఉండకపోవచ్చు.