రివ్యూ – ఆదికేశవ

నటీనటులు – పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, అపర్ణ దాస్, రాధిక, సుదర్శన్ తదితరులు

టెక్నికల్ టీమ్ – సినిమాటోగ్రఫీ – డడ్లీ, ప్రసాద్ మూరెళ్ల, ప్రొడక్షన్ డిజైనర్ – ఏఎస్. ప్రకాష్, ఎడిటింగ్ – నవీన్ నూలి, మ్యూజిక్ – జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు – నాగవంశీ, సాయి సౌజన్య, రచన దర్శకత్వం – శ్రీకాంత్ ఎన్ రెడ్డి.

ట్రైలర్ తో ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఆదికేశవ సినిమా. వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా ఇవాళ థియేటర్స్ లోకి వచ్చింది. యాక్షన్, రొమాన్స్ , ఎంటర్ టైన్ మెంట్ అన్నీ ఉన్న ఆదికేశవ ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా రివ్యూలో చూద్దాం..

కథేంటంటే

ఉద్యోగం వంటి బాధ్యతలేవీ లేకుండా లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేసే యువకుడు బాలు (వైష్ణవ్ తేజ్). లైఫ్ ను లైట్ తీసుకునే బాలు తన కళ్ల ముందు తప్పు జరిగితే మాత్రం ఊరుకోడు. మహిళలు, పిల్లలంటే ప్రేమ చూపిస్తాడు. స్నేహితులతో సరదాగా తిరిగే బాలు..ఒక కంపెనీలో ఉద్యోగానికి వెళ్తాడు. సెలెక్ట్ అయి..ఆ కంపెనీ సీయీవో చిత్ర(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. ఈ లవ్ లైఫ్ సాగుతుంటే.. రాయలసీమలోని బ్రహ్మ సముద్రం అనే ఊరు నుంచి ఒకాయన వచ్చి బాలు అసలు పేరు రుద్రకాళేశ్వర్ రెడ్డి అని, అతని అసలు కుటుంబం వేరే ఉందని చెప్పి అక్కడికి తీసుకెళ్తాడు. బ్రహ్మసముద్రం వెళ్లిన బాలు తన కుటుంబాన్ని కలుసుకున్నాడా..అక్కడ చెంగారెడ్డి అనే రాక్షసుడు లాంటి విలన్ తో ఎలాంటి పోరాటం చేశాడు అనేది మిగిలిన కథ

ఎలా ఉందంటే

1990 చివర నుంచి 2000 సంవత్సరం ప్రారంభం వరకు ఆ పదేళ్లు .ఆ తర్వాత మరో ఐదారేళ్లు ఫ్యాక్షన్ సినిమాలు తెలుగు తెరపై సందడి చేశాయి. ఆ సినిమాల్లోని కథను ఒక్క లైన్ లో చెప్పాలంటే…హీరోకు ఒక గతం ఉంటుంది. అది చూపించకుండా సినిమా ఫస్ట్ పార్ట్ ను మరో నగరంలో, లేదా ఊరిలో చూపిస్తారు. సరదాగా సాగే ఈ మొదటి భాగం నుంచి గొడవలతో నిండిన రెండో భాగంలోకి కథ వెళ్తుంది. మధ్యలో ఇంటర్వెల్. వైష్ణవ్ తేజ్ ఆదికేశవ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లి ఇదే కథను తెరపై చూపించింది. దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఇంకా ఆ పాత ఫ్యాక్షన్ కథ ఫార్ములానే పట్టుకుని, ఈ తరం ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఇప్పుడెలా ఉన్నారు ఆడియెన్స్ అనేది ఆలోచించలేదు. వెబ్ సిరీస్ చూస్తూ, వరల్డ్ వైడ్ గా అందుబాటులో ఉన్న ఓటీటీ కంటెంట్ చూస్తూ ఎంత అడ్వాన్స్ అయ్యారు. అలాంటి వాళ్లకు పాత ఫ్యాక్షన్ కథనే ఆదికేశవ అని టైటిల్ పెట్టి తెరకెక్కించాడు.

సరదాగా నగరంలో ఫ్రెండ్స్ తో తిరిగే బాలు..రాయలసీమ నుంచి వచ్చిన ఒకాయన నువ్వు వీళ్ల కొడుకువు కాదు అని చెబితే వెంటనే వాళ్లతో కలిసి ఊరికి వెళ్లిపోతాడు. అక్కడ చెంగారెడ్డి అనే విలన్ తో ఫైట్స్. మాస్ యాక్షన్ సీక్వెన్సులు. ఇలా సినిమా మన ఊహకు కరెక్ట్ అందుతూ సాగుతుంది. కథలో ఒకట్రెండ్ ట్విస్టులు తప్ప మిగతా ఆకట్టుకునే అంశాలేం లేవు. విలన్ తో ఫైట్స్, హీరోయిన్ తో సాంగ్స్ అన్నట్లుంది సినిమా. బాలు, రుద్రకాళేశ్వర రెడ్డిగా వైష్ణవ్ నటన బాగుంది. ఇటు ప్లెజంట్ గా అటు వైల్డ్ యాక్షన్ తో బాగా మెప్పించాడు. శ్రీలీల అందం, డ్యాన్సులు ఈ సినిమాకు ఆకర్షణ అయ్యాయి. చెంగారెడ్డి గా జోజు జార్జ్ మంచి విలనీ చూపించాడు. టెక్నికల్ గా సినిమా క్వాలిటీగా ఉంది. జీవీ ప్రకాష్ పాటలు ఆకట్టుకోలేదు గానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాత కథతో ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో వచ్చిన ఆదికేశవ బాక్సాఫీస్ దగ్గర పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు.