రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం అనే ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తోంది రేణు దేశాయ్. ఇవాళ ఆమె క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేశారు. సామాజిక కార్యకర్తగా హేమలత లవణం క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకంగా ఉండనుంది. ఈ క్యారెక్టర్ లో నటించడాన్ని ఎంజాయ్ చేశానంటూ రేణు దేశాయ్ గతంలో చెప్పుకుంది.
సామాజిక కార్యకర్త అయిన హేమలత లవణం 1970, 80 దశకాల్లో ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా కరుడు గట్టిన నేరస్తులను జన జీవనంలో కలిపే సంస్కార్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. నేరస్తులతో మాట్లాడి, చర్చల ద్వారా ప్రభుత్వాలను ఒప్పించి ఆ దొంగలను సాధారణ ప్రజా జీవితంలోకి తిరిగి వచ్చేలా చేశారు.
ఆమె స్టువర్టుపురం దొంగ అయిన టైగర్ నాగేశ్వరరావును కూడా సంస్కార్ కార్యక్రమం ద్వారా జన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందా, చేస్తే ఏం జరిగింది అనేది ఈ సినిమాలో రేణు దేశాయ్ క్యారెక్టర్ ద్వారా చూపించబోతున్నారు. అక్టోబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.