“గేమ్ ఛేంజర్”కు అజిత్ గండం

సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ముందుగా వస్తున్న సినిమా రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే.. మాత్రం ఓపెనింగ్స్ వేరే లెవల్లో వస్తాయి. ఈ సినిమాకి బాలకృష్ణ డాకు మహారాజ్ రెండు రోజులు గ్యాప్ ఉండడం, వెంకీ సంక్రాంతికి వస్తున్నాం నాలుగు రోజులు గ్యాప్ ఉండడం ఎంతైనా సానుకాలాంశం. అయితే.. ఇక్కడితో హమ్మయ్యా అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. తెలుగులో సమస్య లేదు కానీ తమిళంలో మాత్రం అజిత్ తో నేరుగా క్లాష్ అయ్యే రిస్క్ చరణ్ కు తప్పేలా లేదు. అజిత్ నటించిన విడాముయార్చి మూవీని జనవరి 10న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని చెన్నై టాక్. అదే జరిగితే గేమ్ ఛేంజర్ తమిళ వెర్షన్ కు థియేటర్ల పరంగా చిక్కులు తప్పవు.

ఎందుకంటే అజిత్ క్రేజ్ దృష్ట్యా తమిళనాడు, కేరళలో ఎక్కువ స్క్రీన్లు తనకు కేటాయించేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం చూపిస్తారు. హైప్ పరంగా విడాముయార్చి వెనుకబడి ఉంది కానీ ఇంకో మూడు నాలుగు రోజుల్లో మొదలుపెట్టే ప్రమోషన్లతో దాన్ని పెంచేందుకు లైకా పక్కా ప్రణాళికతో ఉందట. నిజానికి పొంగల్ రేసులో గుడ్ బ్యాడ్ అగ్లీని దింపాలని మైత్రి మేకర్స్ శతవిధాలా ప్రయత్నించారు కానీ విడాముయార్చి ఇప్పటికే విపరీతమైన ఆలస్యం కావడంతో అజిత్ ప్రాధాన్యం దీని వైపే మొగ్గు చూపింది. దీంతో విడాముయార్చి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ లెక్కన చరణ్ పోటీపడాల్సిన లిస్టులో బాలకృష్ణ, వెంకటేష్ తో పాటు అజిత్ కూడా తోడవ్వబోతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే విడాముయార్చి షూటింగ్ ఇంకా అయిపోలేదు. చివరి దశ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా చేయాల్సి ఉందని సమాచారం. తెలుగులో డబ్బింగ్ కి పెద్ద ఎత్తున కాకపోయినా డీసెంట్ సెంటర్లో రిలీజ్ చేస్తారు. ఓవర్ సీస్ లోనూ అజిత్ ప్రభావం కాసొంత బలంగానే ఉంటుంది.