నెట్ ఫ్లిక్స్ లో “పుష్ప 2” రికార్డ్

అల్లు అర్జున్ హీరోగా, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప 2 డిసెంబర్ లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించింది. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ ఓటిటి రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. జనవరి 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. థియేట్రికల్ లో విడుదలైన 56 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం వల్ల సాధారణంగా తెలుగు సినిమాలు తీసుకునే గ్యాప్ కంటే పుష్ప 2 ఎక్కువే తీసుకుంది. ఇటీవల అదనంగా ఇరవై నిమిషాలు జోడించి రిలీజ్ చేసిన రీ లోడెడ్ వెర్షనే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. అంటే మొత్తం 3 గంటల 44 నిముషాలతో పుష్ప 2 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

పుష్ప 2 మూవీ 56 రోజుల ప్లాన్ ఎంచుకోవడం వెనుక కారణం ఉంది. హిందీ వెర్షన్ ని మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించాలంటే ఖచ్చితంగా ఇంత గ్యాప్ ఉండాలనే నిబంధన ఉత్తరాది ఎగ్జిబిటర్లు పాటిస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకున్న మైత్రి మూవీ మేకర్స్ లేట్ ఓటిటికి ఓటు వేయడం వల్లే నార్త్ లో వారాల తరబడి భారీ వసూళ్లు వచ్చి ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. డిజిటల్ ఇంత దగ్గరికి వచ్చినా కూడా పుష్ప 2 దూకుడు థియేటర్లలో ఇంకా పడిపోలేదు. ఇంకా పుష్ప 2 చూసేందుకు జనం థియేటర్స్ కి వెళ్తూనే ఉన్నారన్న మాట. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్, స్కై ఫోర్స్ లాంటి కొత్త రిలీజులు బోలెడున్నా బన్నీ మూవీ 53వ రోజు కూడా బలంగా హోల్డ్ చేయడం గొప్పే. ఓటీటీ రికార్డ్ విషయానికి వస్తే.. యానిమల్ మూవీ 3 గంటల 21 నిమిషాలు ఓటీటీలో రిలీజ్ అయితే.. అదే ఎక్కువ నిడివితో ఉన్న మూవీ అనుకుంటే.. ఇప్పుడు 3 గంటల 44 నిమిషాల నిడివితో పుష్ప 2 స్ట్రీమింగ్ కానుంది. ఈ విధంగా నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ నిడివి ఉన్న మూవీగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది.