కిరణ్ విజయ్ దేవరకొండ, నేను రశ్మిక – “క”సక్సెస్ మీట్ లో నవ్వించిన నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి

సినిమాకు ప్రతి కష్ట నష్టాన్ని భరించేది నిర్మాత. అలాంటి నిర్మాత ఓ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటే ఆ రిలీఫ్ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాంటి హ్యాపీనెస్ “క” విజయంతో చూస్తున్నారు నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా దీపావళి రోజున రిలీజై ఘన విజయాన్ని అందుకుంది. రెండు రోజుల్లోనే 13.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడిన సరదా మాటలు ఈవెంట్ లో అందరినీ నవ్వించాయి.

నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ – కిరణ్ గారు ఫస్ట్ క సినిమా స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆయన కళ్లల్లో ఒక పట్టుదల చూశాను. కంటెంట్ చాలా కొత్తగా ఉంది అనిపించింది. మా సినిమాకు టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. ఒక సక్సెస్ ఫుల్ సినిమా ఇవ్వాలని టీమ్ వర్క్ చేశారు. అలాగే వీలైనంత తక్కువలో ఎంత బాగా సినిమా చేయాలని వాళ్లు ప్రయత్నించారు. ప్రొడ్యూసర్ ను కాపాడుకోవాలి, అతను బాగుంటే ఇంకా సినిమాలు చేస్తాడని మా టీమ్ గట్టిగా కృషి చేసింది. కిరణ్ గారు ఎక్కువగా మాట్లాడేవారు గీత గోవిదంలో విజయ్ దేవరకొండలా, నేను రశ్మికలా తక్కువ మాట్లాడేవాడిని. ఈ రోజు అవన్నీ రీకాల్ చేసుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంది. నేనేనా ఇంత పెద్ద సూపర్ హిట్ సినిమా చేశాను అనిపిస్తోంది. అన్నారు.