యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. జనవరి నుంచి ఎన్టీఆర్ ఈ మూవీ షూట్ లో జాయిన్ కానున్నారు. అయితే.. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ తన రూటు మార్చి కొత్తగా ట్రై చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. నీల్ నయా ప్లాన్ ఏంటి..?
సినిమా అంటే.. తెర పై కలర్ ఫుల్ గా కనిపించాలి అనుకుంటారు. అయితే.. ఈ రూల్ ను బ్రేక్ చేసి ప్రశాంత్ నీల్ బ్లాక్ థీమ్ ను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ నాలుగు సినిమాలు తీస్తే.. ఆ నాలుగు సినిమాలు బ్లాక్ థీమ్ తోనే సాగాయి. ఇంకా చెప్పాలంటే.. తన సినిమాల పోస్టర్లన్నీ బొగ్గు పులిమినట్లు ఉంటాయి. సినిమాలో విజువల్స్ కూడా అంతే. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ చూసినపుడు ఆ థీమ్ చాలా కొత్తగా అనిపించింది కానీ.. సలార్ చూసే టైంకి జనాలకు కొంత మొనాటనస్ ఫీలింగ్ వచ్చింది. బ్లాక్ థీమ్ ఓవర్ డోస్ అయిపోయిన ఫీలింగ్ కలిగింది. ఇక ప్రశాంత్ సినిమాల్లో హీరోల ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు, ఎడిటింగ్ ప్యాటర్న్స్ కూడా ఒకే స్టైల్లో సాగుతుంటాయి. దీని వల్ల ప్రశాంత్ సినిమాలన్నీ ఒకే రకంగా నడుస్తున్న ఫీలింగ్ కలుగుతోంది జనాలకు. దీంతో అతను తన తర్వాతి చిత్రానికి వైవిధ్యం చూపించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్‌తో చేసే సినిమాకు కథా నేపథ్యాన్ని ప్రశాంత్ మారుస్తున్నాడట. అలాగే విజువల్‌గా కూడా ఈ సినిమా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం వరకు బ్లాక్ థీమ్‌ను పక్కన పెడుతున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రశాంత్ ఈ సినిమాలో ప్రయత్నం చేయనున్నాడట. ఇంతకు ముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో కనిపించిన బ్లాక్ థీమ్.. సినిమాలో ఉండదని సమాచారం. ఈ మూవీ షూటింగ్ నవంబరు నెలాఖర్లో మొదలు కావచ్చని తెలుస్తోంది కానీ.. తారక్ వెంటనే షూటింగ్‌కు హాజరు కాడట. ప్రస్తుతం తారక్ వార్-2 షూట్లో బిజీగా ఉన్నాడు. అతను జనవరి నుంచి ప్రశాంత్ సినిమాకు అందుబాటులోకి వస్తాడని సమాచారం. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో నిర్మించనుంది. రిలీజ్ 2026 సంక్రాంతికి అని ప్రకటించారు. మరి.. ఈ మూవీతో ఎన్టీఆర్, నీల్ సంచలనం సృష్టిస్తారేమో చూడాలి.