డేట్స్ అడ్జెస్ట్ చేయడంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక్కో సినిమా పట్ల ఒక్కోలా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలున్నాయి. ఈ మూడు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో పవన్ భిన్నమైన వైఖరి చూపిస్తున్నారు. పవన్ ఇప్పుడున్న పొలిటికల్ పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుందేమో తెలియదు. పవన్ ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాల్లో ఒక సినిమా మాత్రం చాలా ఒత్తిడికి గురవుతోంది. అదే క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరి హర వీరమల్లు.
మొగల్ కాలం నాటి చారిత్రక నేపథ్యంతో ఒక రాబిన్ హుడ్ లాంటి సినిమాను డిజైన్ చేశారు దర్శకుడు క్రిష్. పవన్ స్నేహితుడు ఏఎం రత్నం నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. లాక్ డౌన్ ముందు మొదలైన ఈ సినిమా నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. మేజర్ షూటింగ్ పార్ట్ మిగిలే ఉంది. ఈ సినిమా తర్వాత మొదలుపెట్టిన ఓజీ, ఉస్తాద్ సినిమాలకు డేట్స్ ఇస్తున్న పవన్…హరి హర వీరమల్లును మాత్రం చిన్న చూపు చూస్తున్నారు. చారిత్రక నేపథ్య సినిమా కాబట్టి మేకోవర్ వంటి విషయాల్లో ప్రత్యేకంగా ఈ సినిమాకు సిద్ధం కావాల్సి ఉండటం దీనికో కారణంగా తెలుస్తోంది.
తాజా పరిస్థితి చూస్తే హరి హర ఇప్పట్లో మొదలయ్యేలా లేదు. అటు పవన్ పొలిటికల్ గా బిజీగా ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు చాలా కీలకం. అందుకే ఆయన ఈ సినిమాల కంటే రాజకీయాల మీద దృష్టి పెట్టబోతున్నారు. దీంతో ఎన్నికలు అయ్యాకే హరి హర షూటింగ్ సెట్స్ మీదకు వెళ్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే మధ్యలో ఓ చిన్న సినిమాకు క్రిష్ ప్లాన్ చేసుకునే అవకాశమూ ఉంది.